Off The Record: తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల ప్రక్రియకు తెర లేచింది. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేలోపే అందుకు సంబంధిచిన షెడ్యూల్ విడుదలైపోయింది. ఈనెల 20న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. పదో తేదీ నామినేషన్ దాఖలుకు ఆఖరు. ఈ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మరోసారి మైండ్ గేమ్ పాలిటిక్స్ మొదలైనట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఈ ఎన్నికలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి పది మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేసి సంతకాలు పెట్టాలి. అలా చేయకుంటే అది స్క్రూటినీలో ఎగిరిపోతుంది. ఈ లెక్కన ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు ఉన్న బలం ప్రకారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్స్ వేయవచ్చు. కానీ… గెలవాలంటే మాత్రం ఒక్కరికి సరిపడా బలం మాత్రమే ఉంది ప్రతిపక్షానికి. ఇక్కడే సిసలైన మైండ్‌గేమ్‌కు తెరలేపాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ… ఇద్దరు నామినేషన్ వేయడానికి ఇబ్బంది లేదుగనుక రెండో సీటు గెలుపు సంగతి తర్వాత…. ముందు ఇద్దరితో నామినేషన్ వేయించి కాంగ్రెస్ మీద వత్తిడి పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు పార్టీలో కూడా ఎమ్మల్సీ ఆశావహులు ఎక్కువగా ఉండటంతో… రెండు నామినేషన్స్ వేయించి గేమ్ మొదలుపెట్టాలని ప్రతిపక్షం భావిస్తోందట.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే… సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికతో ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. దీంతో అధికారికంగా బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. ఇక పది మంది జంపింగ్ జపాంగ్స్ కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో… ఇప్పుడు నికరంగా అసెంబ్లీలో గులాబీ ప్రాతినిధ్యం 28మందికి పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కావాలంటే… అందుకు 22మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఆ లెక్కన చూసుకుంటే… బీఆర్‌ఎస్‌కు దక్కేది ఒక్క సీటే. కానీ… మారుతున్న రాజకీయ పరిస్థితులు, పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం నడుమ మరో సీటుకు కూడా పోటీ పడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట బీఆర్‌ఎస్ పెద్దలు. అదే గనుక జరిగితే రాష్ట్ర రాజకీయం ఇంకా రసవత్తరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇలా… బలం లేకున్నా.. రెండో సీటుకు పోటీ పెట్టడం వల్ల పార్టీగా బీఆర్‌ఎస్‌కు పోయేదేం ఉండదని, అదే సమయంలో రాజకీయంగా రకరకాల ఈక్వేషన్స్‌ను చెక్ చేసుకోవచ్చని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. జరిగేది సీక్రెట్ బ్యాలెట్టే కాబట్టి వెళ్ళిపోయిన తమ ఎమ్మెల్యేల్లో కొందరు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఒకరిద్దరు తమ అభ్యర్థి వైపు మొగ్గితే… దాని ప్రభావం అధికార పార్టీ మీద చాలా ఎక్కువగా ఉంటుందని, అలా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే అవకాశం వస్తుందని లెక్కలేస్తున్నట్టు సమాచారం.
అలాగే… రెండో అభ్యర్థిని పోటీకి పెడితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులవైపు మొగ్గితే…. సుప్రీంకోర్టులో దాన్నో అస్త్రంగా చేసుకోవాలన్న ప్లాన్ బీఆర్‌ఎస్‌కు ఉందట. రెండో అభ్యర్థికి పోలైన ఓట్లలో కోడ్‌ను బట్టి అటువైపు మొగ్గిన వాళ్ళు ఎవరో తేలిపోతుంది కాబట్టి… వాళ్ళనే అనుమానిస్తూ చర్యలు తీసుకునే ఆలోచన ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా ఇరుకున పడతారన్నది గులాబీ పెద్దల ఆలోచన అట. మరోవైపు సాంకేతిక కారణాలతో కొందరు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరవకుండా కూడా ఉండవచ్చని, అలాంటి సందర్భంలో ఏం చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ఎన్నిక అనివార్యం అయితే… సీక్రెట్ బ్యాలెట్ అయినా… ఎవరు ఎవరికి వేశారో కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి… అదే తమకు అస్త్రం అవుతుందన్నది బీఆర్‌ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. ఫైనల్‌గా గులాబీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.