Off The Record: గ్రంధి శ్రీనివాస్. భీమవరం ఎమ్మెల్యే. రాష్ట్రం దృష్టిని ఆకర్షించేలా గత ఎన్నికల్లో నెంబర్ వన్ విజయాన్ని సాధించినా గుర్తింపు విషయంలో ఆయన స్థానం ఎన్నో నెంబరో అర్ధం కావడం లేదట. రెండుసార్లూ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆ విషయంలో అసంతృప్తి లేకపోయినా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన్ని ఆవేదనకు లోను చేస్తున్నాయట. అధినేతని ఒప్పించి.. జనాన్ని మెప్పించినా రావాల్సిన గుర్తింపు ఇంకా దక్కలేదని గ్రంధి అనుచరుల్లోనూ అసంతృప్తి ఉందట. గ్రంధికి ప్రాధాన్యం లేకపోవడం వెనుక నియోజకవర్గ పరిధిలో పవర్‌ఫుల్ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు.
Read Also: Off The Record: ఇంఛార్జ్ పాలనలోనే హైదరాబాద్ కలెక్టరేట్.. పూర్తిస్థాయి కలెక్టర్ వస్తారా లేదా?
నరసాపురం లోక్‌సభ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో గ్రంధి శ్రీనివాస్‌తోపాటు నరసాపురంలో ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ ఉన్నారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవి దక్కడంతోపాటు ప్రసాదరాజుకు చీఫ్‌విప్ పదవి లభించింది. పవన్ కల్యాణ్‌ను ఓడించిన గ్రంధికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పుకొచ్చిన వారంతా తర్వాత పెదవి మెదపడం లేదు. ఎన్నికలు గడిచి మూడున్నరేళ్లు అయినా ఆయనకు ఆశించిన గుర్తింపు, పదవి రాలేదనేది ఆయనతోపాటు ఆయన అనుచరగణంలో అసంతృప్తిగా ఉందట. నరసాపురం పార్లమెంటు పరిధిలో గ్రంధితోపాటు గెలిచిన నలుగురికి కేబినెట్ హోదా రావడమే కాదు.. భీమవరానికే చెందిన కొయ్యే మోషేన్‌రాజును శాసన మండలి ఛైర్మన్‌ను చేశారు. దీంతో తన స్థానం ఏంటనేది గ్రంధికి అంతుబట్టడంలేదట. నెంబర్‌వన్‌గా ఉండాల్సిన గ్రంధిని ఇపుడు ఎన్నో నెంబర్‌గా చూస్తున్నారనేది ఆయన అనుచరుల ప్రశ్న.
Read Also: CM MK Stalin: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ..
గ్రంధి శ్రీనివాస్‌కు అధినేత తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంపై ఆయనతోపాటు అనుచరగణంలో అనుమానాలు రేకెత్తుతున్నాయట. మొదటి నుంచీ పార్టీతో కలిసి నడుస్తున్న గ్రంధిని కాదని భీమవరంలో మరో పవర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారేమో అని సందేహిస్తున్నారట. భీమవరం చుట్టూ పవర్ పాలిటిక్స్ చేస్తున్న నాయకులు ఎక్కువగా ఉండటంతో గ్రంధికి అవకాశం దక్కకుండా పోయిందని టాక్. వచ్చే ఎన్నికల్లోనూ భీమవరంలో వైసీపీ తన బలాన్ని చాటాలంటే పార్టీ నుంచి తగిన ప్రాధాన్యం ఈ ప్రాంతానికి.. ఇక్కడి నాయకులకు ఇవ్వాలని సూచిస్తున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే కేడర్‌లో అసంతృప్తి దేనికైనా దారితీయోచ్చని ఎమ్మెల్యే ఆలోచనలో పడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్ధి ఎవరైనా.. మరోసారి తలపడటానికి.. గెలవడానికి సిద్ధం అంటున్న గ్రంధి శ్రీనివాస్ తనకు తగిన గుర్తింపు కూడా కావాలని కోరుతున్నారట. మరి మూడున్నరేళ్ల తర్వాతైనా ఆయనకు అధినేత ఆశీసులు లభిస్తాయా లేక సాగదీస్తారో చూడాలి.