Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో మెచ్చా నాగేశ్వరరావు ఒకరు. అశ్వారావుపేటలో సైకిల్ గుర్తుపై గెలిచినా తర్వాత కండువా మార్చేశారు. అధికారపార్టీకి జైకొట్టారు మెచ్చా. ఆయన గులాబీ కండువా కప్పుకొన్నప్పటికీ నియోజకవర్గంలో పార్టీ కేడర్ మింగిల్ కాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేకు కొత్త సమస్య సవాల్ విసురుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసమ్మతి బాట పట్టడంతో ఆ ప్రభావం అశ్వారాపుపేటలోనూ కనిపిస్తోంది. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపైనా.. ప్రభుత్వంపైనా అసంతృప్తితో ఉన్న వారిని బుట్టలో వేసుకునేందుకు చూస్తున్నారట పొంగులేటి.
పొంగులేటిని అనుసరించడానికి సిద్ధపడ్డ నాయకులు ఎమ్మెల్యే మెచ్చాపై కత్తులు దూస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ఓపెన్‌గానే విమర్శలు చేస్తున్నారు. వీరిలో కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి బలం చాటుకునే ఎత్తుగడ వేశారు. తాజా సమావేశానికి ఓ ఎంపీపీ, కొందరు సర్పంచులు.. మరికొందరు పార్టీ నాయకులు హాజరు కావడంతో వేడి రాజుకుంది. వీళ్లంతా పొంగులేటిని అనుసరిస్తూ కావాలనే ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నారనేది అధికారపార్టీ నేతల వాదన. కాకపోతే ఓపెన్‌గా ఎమ్మెల్యేను ఛాలెంజ్ చేయడం చర్చగా మారింది. మెచ్చాపై తీవ్ర ఆరోపణలే చేశారు.
నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే మెచ్చా చుట్టూనే తిరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సడెన్‌గా యూటర్న్ తీసుకోవడంతో ఎవరు ఎటువైపు ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజా విమర్శలపై ఎమ్మెల్యే వర్గం కుతకుతలాడుతోంది. అసమ్మతి వర్గానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని యోచిస్తోంది. సమయం సందర్భం చూసుకుని పార్టీ ఆదేశాల మేరకు యాక్షన్ ఉంటుందని లీకులు ఇస్తున్నారు. అయితే అసమ్మతి శిబిరానికి చెందిన కొందరు నాయకులు మాత్రం.. తాము కష్టంలో ఉన్నప్పుడు పొంగులేటి అండగా ఉన్నారని.. ఇప్పుడు మాజీ ఎంపీతోనే ప్రయాణం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేకవర్గాలు నియోజకవర్గంలో బలంగా మోహరిస్తున్నాయి. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ పరిణామాలు మరింత రసవత్తరంగా మారతాయని.. పరస్పరం విమర్శలు.. ఆరోపణలు ఇంకా పదునెక్కుతాయని భావిస్తున్నారు.