Off The Record: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నాలుగు దశాబ్దాలకు పైగా టిడిపితో అనుబంధం ఉన్న నల్లమిల్లి… తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈసారి కాషాయ కండువా కప్పుకున్నారు. రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి టిడిపి ఆవిర్భావం నుంచి కొనసాగుతూ అదే పార్టీ తరపున నాలుగు సార్లు అనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014లో రామకృష్ణారెడ్డి తొలిసారి టిడిపి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారాయన. ఇక 2024లో పొత్తు కారణంగా అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీ కోటాలోకి వెళ్ళిపోయింది. దాంతో… టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టిక్కెట్టు వగులుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో… ఇక్కడ బీజేపీకి కూడా సరైన అభ్యర్థి లేకపోవడంతో… రామకృష్ణారెడ్డికే ఆఫర్ చేసింది కమలం పార్టీ. ఇక మరో మాట లేకుండా పసుపు కండువాను కాస్త పక్కకు జరిపి… కాషాయ కండువాను పైకి కనిపించేలా చేసుకున్నారాయన. బీజేపీ బీ ఫామ్ మీద పోటీ చేసి గెలిచారు.
Read Also: Eesha Rebba : జాలిలాంటి చీరలో ఈషారెబ్బా అందాల విందు
అంతవరకు బాగానే ఉన్నా… ఆ తర్వాతే అసలు సమస్య మొదలైందట. ఎమ్మెల్యేగారు ఏదో… రాజకీయ అవసరం కోసం అప్పుడంటే కాషాయంలో కనిపించారుగానీ… ఇన్‌బిల్ట్‌గా ఉన్న ఒరిజినల్ పసుపు అలాగే ఉంది. ఆయనకు సైకిల్ మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదన్నది లేటెస్ట్ టాక్. ఈ మాటలు అంటున్నది కూడా అనపర్తి బీజేపీ నాయకులే. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తీరువల్ల అనపర్తి బీజేపీ రివర్స్ గేర్‌లో ఉందని, దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడ్డవాళ్ళని ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీ కోటాలోకి రావడంతో సంతోషించామని, కానీ… నల్లమిల్లి తీరుతో ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదని అంటున్నారు లోకల్ బీజేపీ లీడర్స్. ఎమ్మెల్యే తాను గెలిచిన పార్టీ కేడర్‌ని పక్కనబెట్టి… ప్రతి విషయంలోనూ టీడీపీ శ్రేణులకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనపర్తి బీజేపీ లీడర్స్. పార్టీ మారినా… ఆయనకు టీడీపీ మీద మమకారం ఏ మాత్రం తగ్గలేదని, అందుకే నామినేటెడ్ పోస్టుల్లో మొత్తం తెలుగుదేశం వాళ్ళనే నియమిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కమలం గుర్తు మీద గెలిచిన నల్లమిల్లి కనీస విశ్వాసం లేకుండా… టీడీపీ వాళ్ళకు పెద్దపీట వేయడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట బీజేపీ నాయకులు.
Read Also: Eesha Rebba : జాలిలాంటి చీరలో ఈషారెబ్బా అందాల విందు
అనపర్తి మండలంలో ఒక్క బీజేపీ కార్యకర్తను కూడా పట్టించుకోలేదని బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏటా 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న అనపర్తి పంచాయతీతో పాటు రెవెన్యూ, ప్రభుత్వ ఆసుపత్రి తదితర అన్ని వ్యవస్థల్లోనూ టీడీపీ కార్యకర్తలనే నియమించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. పర్సంటేజ్‌ల కోసమే అలా చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారట కొందరు బీజేపీ నాయకులు. పొత్తు ఒప్పందం ప్రకారం… అనపర్తి నియోజకవర్గంలో ఎంతమంది బీజేపీ నాయకులకు పదవులు దక్కాయో చెప్పాలన్నది లోకల్ కమలం లీడర్స్ డిమాండ్. వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తిని పార్టీ మండల అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి నియమించడాన్ని బిజెపి శ్రేణులు తప్పుపడుతున్నాయట. పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళని పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఉపాధి హామీ కూలీలను బిజెపి క్రియాశీలక సభ్యులుగా చూపిస్తూ పార్టీని మభ్యపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి విఫలమయ్యారని, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గాలికి వదిలేసి, కేవలం ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని సొంత బీజేపీ కేడరే మిమర్శించడం ఇక్కడ హైలైట్. ఇకనైనా ఎమ్మెల్యే నల్లమిల్లి పద్ధతి మార్చుకుని బీజేపీకి విధేయుడిగా పనిచేయాలన్నది వాళ్ళ డిమాండ్.