Off The Record: అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నది సామెత. ఇప్పుడు ఏపీ లిక్కర్ ఎపిసోడ్‌లో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్న వాళ్ళంతా… ఈ సామెతను గుర్తు చేసుకుంటున్నారట. ఎవరు దొంగలు, ఎవరు దొరలు…. అసలు ఎవరిది పాతివ్రత్యం అంటూ…పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు సామాన్య జనంలో కూడా చర్చలు మొదలయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున మద్యం కుంభకోణం చేసిందని ఆరోపిస్తున్న కూటమి పార్టీలు… అధికారంలోకి వచ్చాక దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశాయి. ఈ విషయంలో కూటమి అనేకంటే…. ప్రత్యేకించి టీడీపీకి ఎక్కువ శ్రద్ధ అన్నది రాజకీయవర్గాల్లో ఉన్న విస్తృతాభిప్రాయం. అందులో వైసీపీ పెద్ద తలకాయల పాత్రే ఉందని ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి. సరిగ్గా… ఇదే సమయంలో వెలుగుచూసిన నకిలీ మద్యం… ఇప్పుడు టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోందని అంటున్నారు. దానికి సంబంధించి పార్టీ నేతను సస్పెండ్ చేసినా… ఎక్సైజ్ అధికారి మీద వేటు వేసినా…. అంటిన మకిలి అంత త్వరగా పోతుందా? దీనికి టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.
కల్తీ మద్యం దందా చేసి జనం జీవితాలతో ఆడుకున్నారంటూ… ఇన్నాళ్ళు మనం వైసీపీ వాళ్ళను అన్నాం. కుంభకోణంలో ఆపార్టీ నేతలు కొందరు అరెస్ట్ అయ్యారు, మరి కొందర్ని రేపో మాపో అరెస్ట్ చేస్తారని చెప్పుకుంటున్నారు. కానీ… ఇప్పుడు మనోళ్ళు చేసిందేంటని టీడీపీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంట. వాళ్ళు మద్యాన్ని కల్తీ చేస్తే… మనోళ్ళు ఏకంగా నకిలీ మందే తయారు చేసి….పీకల్లోతున ఇరుక్కున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయట టీడీపీ సర్కిల్స్‌లో. మందు విషయంలో ఇన్నాళ్ళు వైసీపీని ఏకిపారేసి ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయామేంట్రా దేవుడా అంటూ తలలు కొట్టుకుంటున్న బ్యాచ్ కూడా ఉందట తెలుగుదేశంలో. 99 రూపాయలకే క్వాలిటీ మద్యం అని ప్రచారం చేసుకున్నాం… ఆ విషయంలో మందు బాబులు హ్యాపీగా ఉన్నారని ఫీలవుతున్నాం….కానీ… చివరికి సొంత పార్టీ మనుషులే నకిలీ మద్యం తయారు చేయడాన్ని ఎలా చూడాలి? రేపు వైసీపీని ఎలా కౌంటర్ చేయాలని మధనపడుతున్నట్టు సమాచారం. పైగా… ఈ నకిలీ దెబ్బకు ఇన్నాళ్ళు 99 రూపాయలకు సరఫరా చేసిన నాణ్యమైన మద్యం మీద కూడా అనుమానాలు రేగే ప్రమాదం ఉందని భయపడుతున్నారట.
ఈ క్రమంలోనే… తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా… నకిలీ మద్యానికి సంబంధించి రెండు గంటలపాటు సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నట్టు అంచనా వేస్తున్నారు. మామూలుగా అయితే… ఆయన అంతలా రియాక్ట్ అవబోరని, నకిలీ మద్యం పేరుతో జరుగుతున్న డ్యామేజ్ ఏ స్థాయికి వెళ్తుందో అర్ధమైంది గనుకనే… అలా చెప్పుకున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అసలీ విషయంలో అధికారులను తప్పు పట్టాలో.. లేక తమ నాయకుల్ని మాత్రమే తప్పు పట్టాలో… తెలియని గందరగోళంలో ఉన్నారట కూటమి పెద్దలు. ఇప్పుడిక గత ప్రభుత్వం, మద్యం కుంభకోణం అంటూ ఎన్ని చెప్పినా… జనం ముందంత సీరియస్‌గా తీసుకోకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం. దీని ప్రభావం లాంగ్‌రన్‌లో ప్రభుత్వం మీద పడుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించినంత మాత్రాన మంచి జరుగుతుందా, పరిష్కారం దొరుకుతుందా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వ్యవహారాల్లో సిట్‌లు నడుస్తుండగా… ఇప్పుడు నకిలీ మద్యం మీద కూడా వేస్తే… ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్నది కూడా క్వశ్చన్ మార్కేనంటున్నారు పరిశీలకులు. మొత్తం మీద ఈ నకిలీ మద్యం ఎపిసోడ్‌తో కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోందని, అందుకే సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి అంత సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్.