బీజేపీ అనుకూల ప్రకటనలు… కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఆయన స్టైల్. రేవంత్ అంటే వ్యతిరేకత లేదంటారు. కానీ హస్తం పార్టీలో మాత్రం చేరలేదు. చివరికి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఊరించి, ఊరించి కమలం జెండా వైపు మొగ్గిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా బీజేపీనే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటున్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య ఉన్న బంధం ఏమిటనేది తెలియదు కానీ, పిసిసి చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. ఆహా, ఓహో అన్నారు. తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సైలెంట్‌గా సైడైపోయారు. కాషాయ జెండా కప్పేసుకున్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత, ఆయనతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సత్సంబంధాలు నెరిపారు. దాన్ని చూసిన వాళ్లు కొండా తిరిగి కాంగ్రెస్ పార్టీ కి వస్తారని భావించారు. రేవంత్ కూడా అదే విధంగా లెక్కలు వేసుకున్నారని టాక్ ఉంది. కానీ, చివరికి మాట కూడా చెప్పలేదని, రేవంత్ చెప్పుకొనే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ కూడా ఊహించి ఉండరనే టాక్ నడుస్తోంది.
రేవంత్ పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ కి మళ్లీ జీవం వచ్చినట్టే అని…రేవంత్ లాంటి వ్యక్తి పీసీసీ అవ్వాలని గతంలో స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తీరా రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత సీన్ మారిది. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డీ బీజేపీ లో చేరునట్టు ప్రకటించారు. పైగా తెలంగాణ లో కాంగ్రెస్ అంత బలంగా లేదని, టియ్యారెస్‌ని ఎదుర్కునే శక్తి బీజేపీ కే ఉందని స్టేట్మెంట్ కూడా ఇచ్చి, రేవంత్ టీమ్‌కు షాక్ ఇచ్చారు కొండా. దీంతో రేవంత్ వర్గం కూడా.. కొండా గురించి ఎక్కువ ఊహించుకుని పొరపాటు పడ్డారనే టాక్ గాంధీ భవన్‌లో వినిపిస్తోంది.
Read Also: చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్న నేత.. అయోమయంలో క్యాడర్
నిజానికి హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ఈటెలకు కొండా మద్దతు ప్రకటించారు. అప్పుడు కూడా రేవంత్ మేలుకొలేదు. మొదటి నుండి కొండా బీజేపీ కి అనుకూల స్టేట్మెంట్ లు ఇస్తూనే, కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఇప్పుడు కొండా బీజేపీ చేరిక పై కూడా రేవంత్ అంతగా స్పందించకపోవటం ఆసక్తికరంగా మారింది.
అయితే కాంగ్రెస్ విమర్శిస్తావా అంటూ జగ్గారెడ్డి మాత్రం కొండా విశ్వేశ్వర్ రెడ్డిని విమర్శించారు. ఆయన ఏ పార్టీ లో చేరిన మాకు అభ్యంతరం లేదు…కానీ కాంగ్రెస్ గురించి తక్కువ చేసి మాట్లాడతావా అని ప్రశ్నించారు. అంతేకాదు.. అసలు నువ్వు లీడర్ వేనా, టీఆర్ఎస్ పుణ్యాన ఎంపీ అయ్యావు తప్ప అంతకంటే విషయం ఏముందని ఎటాక్ చేశారు జగ్గారెడ్డి. వ్యాపారాల కోసం బీజేపీ లో చేరే వాళ్లకు.. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు జగ్గారెడ్డి..
మొత్తానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యవహరం రేవంత్ టీమ్‌ను విస్మయానికి గురిచేసేలా మారిపోయింది. ఆయన ఊరించి ఊరించి చివరికి ఉసూరుమనిపించారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.