Nandyala YCP Politics : నంద్యాల వైసీపీలో వర్గపోరు ముదురుతోందా? ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్న ముఖ్యనేతలు.. ఇప్పుడు దూరం అయ్యారా? ఆయన వ్యతిరేక శక్తులు ఎందుకు ఏకం అవుతున్నాయి? నంద్యాల వైసీపీలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయా? లెట్స్ వాచ్..!
నంద్యాల టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మలుచుకుని గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో మరింత పట్టుబిగించింది అధికారపార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్. అప్పట్లో టీడీపీ.. ఇప్పుడు వైసీపీ అన్నట్టుగా గ్రూప్ పాలిటిక్స్ మారిపోయాయి. ఇక్కడ అధికారపార్టీని ఓ రేంజ్‌లో వర్గపోరు వెంటాడుతోంది. స్వపక్షమే శత్రుపక్షంగా మారి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిబిరాన్ని ఉలిక్కి పడేలా చేస్తోందట. నిన్న మొన్నటి వరకు శిల్పా కుటుంబానికి లెఫ్ట్, రైట్‌గా ఉన్న వైసీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారట. టీడీపీ కంటే వైసీపీ అసమ్మతి నేతలే శిల్పా ఫ్యామిలీపై పదునైన విమర్శలు చేయడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. అసమ్మతి నేతల్లో కొందరు కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నరనే ప్రచారం అధికారపార్టీని మరింత కలవర పెడుతోందట.
ఎమ్మెల్యే శిల్పా కుటుంబానికి వ్యతిరేకంగా జట్టుకట్టిన వారిలో వైసీపీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ నౌమాన్, లీగల్ సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డి కీలకంగా ఉన్నారని చెబుతారు. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో 2017లో వచ్చిన ఉపఎన్నికలో వైసీపీ టికెట్ ఆశించారు రాజగోపాల్‌రెడ్డి. అయితే టీడీపీని వీడి వచ్చిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి వైసీపీ ఛాన్స్ ఇచ్చింది. నంద్యాల ఉపఎన్నిక ప్రచారానికి వచ్చిన పార్టీ అధినేత జగన్ 14 రోజులు రాజగోపాల్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో మరోసారి పార్టీ టికెట్ ఆశించినా.. రాజగోపాల్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేస్తామని హామీ ఇచ్చి సర్ది చెప్పారు. శిల్పా రవి బరిలో దిగడం.. వైసీపీ నుంచి గెలవడం చకచకా జరిగిపోయింది.
మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య లలితను ఛైర్ పర్సన్‌ను చేద్దామని రాజగోపాల్‌రెడ్డి ఆశించారట. అదే పదవికి ఎమ్మెల్యే శిల్పా రవి భార్య నాగినిరెడ్డి కూడా పోటీ పడటంతో.. చివరకు ముస్లిం సామాజికవర్గానికి చెందిన మాబున్నీసాకు పార్టీ ఛాన్స్ ఇచ్చింది. ఇలా వైసీపీలో తనకు పదవులు దక్కకుండా పోవడానికి శిల్పా కుటుంబమే కారణమని రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయ పడుతున్నారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు కూడా. ప్రస్తుతం ఎమ్మెల్యే శిల్పా రవితో కలిసి రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు.
నౌమాన్ సైతం శిల్పా కుటుంబంపై అసంతృప్తితో ఉన్నారట. వైఎస్‌ఆర్ హయాంలోనే నౌమాన్ APPSC సభ్యుడిగా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరి ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2019లో వైసీపీలో చేరి మళ్లీ అదే పదవి ఆశించారు నౌమాన్. అలాగే పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డి గత రెండు దశాబ్దాలుగా శిల్పా కుటుంబంతోనే ఉన్నారు. అయితే ఆయన మార్కెట్ పదవి ఆశించినా దక్కలేదు. ఆయనకు కూడా శిల్పా కుటుంబంపైనే అనుమానాలు ఉన్నాయట. తులసిరెడ్డి, నౌమాన్ ఇద్దరూ ఎమ్మెల్యే శిల్పాతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తమ చెప్పుచేతల్లో ఉన్నవారికే శిల్పా కుటుంబం పదవులు ఇస్తోందని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో నంద్యాల వైసీపీలో వర్గపోరు పీక్స్‌కు చేరుకుంటోంది. ఇప్పటికే వైసీపీలో రిపేర్లు మొదలు పెట్టిన పార్టీ పెద్దల జాబితాలో నంద్యాల ఉందో లేదో కానీ.. ఇక్కడి వర్గపోరుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి పార్టీ వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.