Off The Record: ఉత్తరాంధ్ర మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెడుతోందా? ప్రత్యేకించి పార్టీ అగ్రనేత నాగబాబు శ్రీకాకుళం జిల్లాను కార్యక్షేత్రంగా ఎంచుకున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఇప్పట్నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారా? అసలు ఇప్పుడా డౌట్ ఎందుకు వచ్చింది? వచ్చేలా ఏం చేశారు నాగబాబు?
Read Also: Off The Record: వైసీపీ చేతికి రెండు పదునైన అస్త్రాలు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. రకరకాల ఈక్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పార్టీ ముఖ్యులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని, వాళ్ళ కదలికలు ఇదే విషయం చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు జిల్లా నేతలతో వరుస మీటింగ్స్ పెట్టడం, వారం రోజుల వ్యవధిలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో పర్యటించడం లాంటివి నోట్ చేసుకోవాల్సిన పరిణామాలంటున్నారు. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నాగబాబు ఇలా పర్యటించడంలో మామూలుగా అయితే విశేషం ఏదీ ఉండదుగానీ.. ఆయన వెంట కూటమిలోని ఇతర పార్టీల నాయుకులు ఎవరూ లేకపోవడమే ఆసక్తి రేపుతోంది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్యను తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు స్థానిక టిడిపి ఎమ్మెల్యే గోండు శంకర్ వెంట లేరు. అలాగే… ఎచ్చెర్ల నియోజకవర్గం మడ్డువలస సాగునీటి కాలువల పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు పొల్గొనలేదు. వాస్తవానికి ఈ రెండూ సొంత పార్టీ కార్యక్రమాలు కాదు. మిత్రపక్షానికి చెందిన అగ్రనేత వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనవచ్చు. కానీ… టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు లేకుండా నాగబాబు మాత్రమే వెళ్ళడం చర్చనీయాంశం అయింది.
Read Also: Off The Record: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యేలు డీలా పడ్డారా ? జిల్లా వ్యవహారాలు పట్టించుకోని సీనియర్స్
ఎమ్మెల్యేలు లేని సమయంలో నాగబాబు పర్యటిస్తున్నారా? మైలేజ్ తమకు మాత్రమే రావాలన్న లక్ష్యంతో కావాలనే వాళ్ళని దూరం పెట్టారా అన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఈ రెండు పర్యటనల్లో జనసేన నేతల హడావిడి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లేదా మడ్డువలస కాలువ గురించి నాగబాబుకు కనీసం అవగాహన కల్పించే నాయకులు కూడా పర్యటనలో లేరట. అయితే… వీటి గురించి శాసనమండలిలో మాట్లాడతానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారట నాగబాబు. ఇక్కడే సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఏ కారణం లేకుండా జనసేన ఎమ్మెల్సీ ఇక్కడి దాకా వచ్చి… పరిశీలించి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తారా? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ వేరే ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ఈ జిల్లాలో పొలిటికల్ ప్లాట్‌ఫాం సిద్ధం చేసుకుంటున్నారా అన్నది ఎక్కువ మందికున్న అనుమానం. 2029 ఎన్నికల్లో ఎచ్చెర్ల లేదా శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి. ప్రధానంగా ఎచ్చర్ల మీదే ఆయన దృష్టి ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఈ టిక్కెట్‌ను కొందరు జనసేన నేతలు ఆశించారు. కానీ బీజేపీ కోటాలో కమ్మ సామాజికవర్గానికి చెందిన నడికుదిటి ఈశ్వరరావుకు దక్కింది.
Read Also: Nellore Murder Case: బాధితులను ఆదుకుంటాం.. శవ రాజకీయాలు చేయొద్దు..
బలమైన కమ్మ లాబీయింగ్‌తో…2029లో కూడా టిక్కెట్ నాదేనని ఈశ్వరరావు ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక టిక్కెట్ తమకు రాదని నిర్ధారించుకున్న స్థానిక జనసేన నేతలు వ్యూహాత్మకంగా నాగబాబును తెర మీదికి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ సీటును జనసేన కోటాలో తీసుకుని నేరుగా నాగబాబు బరిలో ఉంటే… ఉత్తరాంధ్రలో పార్టీకి కూడా ప్లస్ అవుతుందని నచ్చజెపుతున్నారట. అందుకు తగ్గట్టే.. నాగబాబు కూడా తరచూ జిల్లాలో పర్యటించేలా ఓ కార్యాలయం ఏర్పాటు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఎచ్చెర్లలో కాపు ఓటింగ్ ఎక్కువ. అందుకే నాగబాబు ఇటువైపు దృష్టిపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అయితే… ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి…. ఇప్పట్నుంచే ఇలా చేస్తే కూటమిలో విభేదాలు వస్తాయన్న భయాలు సైతం ఉన్నాయి. ఇప్పటికే… స్థానిక ఎమ్మెల్యేలు లేకుండా జనసేన ఎమ్మెల్సీ పర్యటనలు ఏంటన్న చర్చ మొదలైందట కూటమి వర్గాల్లో. అనుకున్నట్టుగా… ఎచ్చెర్లలో నాగబాబు ఆఫీస్ పెడితే… అది అధికార కేంద్రంగా మారుతుందని, కూటమిలో విభేదాలకు ఆజ్యం పోస్తుందన్న ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్సీ కొత్త పొలిటికల్ స్టెప్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరి.