ఎమ్మెల్యే, మాజీ మేయర్ మధ్య రేగిన రగడ.. కొత్త పుంతలు తొక్కుతోందా? అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు పావులు కదుపుతున్నారా? వర్గపోరు అధికారపార్టీలోనూ చర్చగా మారిందా? ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా గొడవ?
2018 ఎన్నికల్లో మొదలైన బొంతు, బేతిల మధ్య రగడ!
బేతి సుభాష్‌రెడ్డి. ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈయన బొంతు రామ్మోహన్. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్. ఇద్దరూ అధికారపార్టీ నేతలైనా.. ఉప్పు నిప్పులా ఉందట వీరి మధ్య ఆధిపత్యపోరు. గతంలో రామ్మోహన్ ప్రాతినిథ్యం వహించిన చర్లపల్లి డివిజన్ నుంచే ఆయన భార్య బొంతు శ్రీదేవి కార్పొరేటర్‌గా ఉన్నారు. అది ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పల్ టికెట్ ఆశించారు బొంతు. కానీ.. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న సుభాష్‌రెడ్డికే పార్టీ ఓకే చెప్పింది. అలా 2018లో ఇద్దరి మధ్య మొదలైన గొడవ… ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోందట.
ఎమ్మెల్యే పక్షపాతంగా ఉంటున్నారని బొంతు శ్రీదేవి ఫైర్!
పాత విభేదాలను మనసులో పెట్టుకున్నారో ఏమో.. ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు శ్రీదేవి. చర్లపల్లి డివిజన్‌లో చేపట్టే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని.. ఆమె మండిపడుతున్నారు. అభివృద్ధి పనుల సమాచారం కార్పొరేటర్‌కు ఇవ్వడం లేదట. ఎమ్మెల్యే పర్యటనకు వచ్చినా చెప్పడం లేదట. ఈ వివాదమే ఇప్పుడు GHMC పరిధిలోని టీఆర్‌ఎస్‌లో చర్చగా మారుతోంది. బేతి.. బొంతు మధ్య ఉన్న కోల్డ్ వార్‌లో భాగంగానే శ్రీదేవిని ఎమ్మెల్యే పక్కన పెట్టారన్నది పార్టీలో ఓవర్గం చేస్తున్న ఆరోపణ.
మాజీ మేయర్‌పై ఉన్న కోపాన్ని కార్పొరేటర్‌పై చూపిస్తున్నారా?
ఉప్పల్ టీఆర్ఎస్‌లో ఈ వర్గ రాజకీయాలు పీక్ స్టేజ్‌లోకి వెళ్లాయి. గ్రేటర్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బొంతు శ్రీదేవిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని రామ్మోహన్ అనుకున్నారు. కానీ.. అది సాధ్యం కాలేదు. అటు 2018లో ఎమ్మెల్యే టికెట్ రాక.. ఇటు భార్యను మేయర్‌ను చేసుకోలేక ఇబ్బంది పడ్డారట మాజీ మేయర్. అప్పటి నుంచి రామ్మోహన్ రాజకీయంగా పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఇదే టైమ్ అనుకున్నారో.. పాత పగలు తీర్చుకుంటే పార్టీలో అడ్డు చెప్పరని భావించారో కానీ.. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి బొంతు ఫ్యామిలీపై అస్త్రాలు సంధిస్తున్నట్టు టాక్. రామ్మోహన్‌పై ఉన్న కోపాన్ని.. టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా ఉన్న ఆయన భార్యపై పగ సాధిస్తున్నట్టు భావిస్తున్నారట.
బేతి పగ సాధిస్తున్నారని బొంతు వర్గం అనుమానం!
ఉప్పల్ పరిధిలో ఉన్న మిగతా కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సఖ్యంగా ఉంటున్నా.. చర్లపల్లి డివిజన్‌కు వచ్చే సరికి ఏదో తేడా కొడుతోందని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఉప్పల్‌లో రాజకీయంగా పోటీ లేకుండా.. టీఆర్ఎస్‌లో ప్రత్యర్థులు ఎదురు కాకుండా సుభాష్‌రెడ్డి పావులు కదుపుతున్నట్టు బొంతు వర్గం అనుమానిస్తోందట. మరి.. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ గ్రూప్ వార్ రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.