చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం. వైసీపీలో వర్గ వివాదాలు.. విభేదాలు.. గ్రూప్ పాలిటిక్స్‌కు నగరి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పంచాయితీలు పలుమార్లు వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. అయినప్పటికీ రివెంజ్ పాలిటిక్స్ కొదవ లేదు. నగరి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆర్కే రోజా. సొంత పార్టీలోనే ఆమెకు అసమ్మతి సెగ ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ సమస్య మరింత ముదిరి పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం రోజా మంత్రి కావడంతో నగరి వైసీపీలో ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది.
నగరి వైసీపీలో కేజే కుమార్, అమ్ములు, రెడ్డివారి చక్రపాణిరెడ్డి వర్గాలు మంత్రి రోజాకు వ్యతిరేకం. వీరందరికీ పదవులు రావడం వెనక మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి ఆశీసులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అందుకే రోజాను ఓపెన్‌గానే సవాల్ చేసేవారు అసమ్మతి నేతలు. వచ్చే ఎన్నికల్లో రోజా ఎలా గెలుస్తారో చూస్తామన్న సవాళ్లు విసిరారు.వారివెనక ఎవరున్నా.. రోజా గట్టిగానే కౌంటర్ ఇచ్చేవారు. ఇప్పుడు మంత్రి కావడంతో తగ్గేదే లేదన్నట్టుగా దూసుకెళ్లే ప్లానింగ్‌లో ఉంది రోజావర్గం.
మూడేళ్లుగా నగరిలో ఎదురైన చేదు అనుభవాలకు రివెంజ్ తీర్చుకునే పనిలో ఉన్నారట రోజా అండ్ కో. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్టుగా వార్నింగ్‌లు ఇస్తున్నారట. మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గాలకు నేరుగానే హెచ్చరికలు చేస్తున్నారట. దీంతో రానున్న రోజుల్లో నగరిలో ఏం జరుగుతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోందట. ఎవరి దగ్గరకు వెళ్లితే ఎవరికి కోపం వస్తుందో అని కలవర పడుతున్నారట.
నిన్న మొన్నటి వరకు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి పేర్లు చెప్పి పనులు చేయించుకొనేవాళ్లు వారి వర్గాలు. ఇప్పుడు రోజానే మంత్రిగా రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైందట. ముగ్గురు మంత్రుల నుంచి వచ్చే ఒత్తిళ్లను తలచుకుని టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నగరిలో ఏ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కలిసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. రాబోయే కష్టాలను ఊహించుకొని కొందరు ఉద్యోగులు నగరి నుంచి వేరే ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అటు కేడర్.. ఇటు ఉద్యోగుల తీరు చర్చగా మారింది. మరి.. రానున్న రోజుల్లో నగరి పార్ట్-2 రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూడాలి.