దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇరుక్కుని.. రాజకీయంగా ఉనికి కోల్పోయిన ఆ మాజీ మంత్రి.. కొత్తగా పక్కచూపులు చూస్తున్నారా? ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్నప్పటికీ సంతృప్తిగా లేరా? కొత్తగూటిలోని లెక్కలు ఏం చెబుతున్నాయి? ఎవరా మాజీ మంత్రి? ఏమా కథా?
రాజకీయ భవిష్యత్ కోసం పక్కచూపులు
సి. కృష్ణయాదవ్. ఒకప్పుడు హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఈ మాజీ మంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణయాదవ్ లెక్కేవేరు. కానీ.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని పొలిటికల్ స్క్రీన్ నుంచి తెరమరుగయ్యారు. కొన్నాళ్లూ జైలులో ఉన్నారు కూడా. రాజకీయంగా ఉనికిలో లేకుండా పోయారు కృష్ణయాదవ్. ఆ కేసు నుంచి బయటపడి.. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయినా.. ఈ మాజీ మంత్రికి ఎక్కడో తేడా కొడుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు కృష్ణయాదవ్. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో కృష్ణయాదవ్ ఎంత చెబితే అంత అన్నట్టు ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆయన్ని పట్టించుకునేవాళ్లే లేరు. అందుకే రాజకీయ భవిష్యత్ కోసం పక్క చూపులు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది.
కేసులో ఇరుక్కున్నాక అనుచరులు చెల్లాచెదురు
గతంలో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు కృష్ణయాదవ్. ఇప్పుడు హిమాయత్ నియోజకవర్గం లేదు. నియోజకవర్గాల పునర్విభజనలో రద్దయింది. ఇంతలో కేసులో ఇరుక్కుని జైలుకెళ్లడంతో.. అనుచరులూ చెల్లాచెదురయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారట ఈ మాజీ మంత్రి. అయితే టీఆర్ఎస్‌లో టికెట్ వస్తుందో రాదో అనే అనుమానాలు ఉన్నాయట. అందుకే టీఆర్ఎస్‌ను వీడే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.
బీజేపీని అంబర్‌పేట సీటు కోరుతున్న కృష్ణయాదవ్..?
ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారట కృష్ణయాదవ్. బీజేపీలో చేరే విషయంలో చర్చ జరిగినట్టు టాక్. అంబర్‌పేట టికెట్ ఇస్తే కాషాయ కండువా కప్పుకొంటానని కృష్ణయాదవ్ చెప్పారట. ప్రస్తుతం ఈ అంశం బీజేపీ అధిష్ఠానం దగ్గర పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి అంబర్‌పేట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీటు. గతంలో ఆయనే అంబర్‌పేట ఎమ్మెల్యే. 2018లో ఓడిన తర్వాత సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఎంపీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కిషన్‌రెడ్డి అంబర్‌పేట నుంచి పోటీ చేస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఎంపీగానే మళ్లీ పోటీ చేస్తే అంబర్‌పేట సీటు ఖాళీగా ఉంటుందని.. అందుకే అక్కడ కర్చీఫ్ వేసే ఆలోచనలో కృష్ణయాదవ్ ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు.
అంబర్‌పేట టికెట్ బీజేపీ నిరాకరిస్తే ఏం చేస్తారు?
అంబర్‌పేట వైపు కృష్ణయాదవ్ చూడటానికి కొన్ని లెక్కలు ఉన్నాయట. పాత హిమాయత్‌నగర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు పునర్విభజనలో అంబర్‌పేటలో కలిశాయి. పైగా యాదవ సామాజికవర్గం ఓట్లు కూడా అంబర్‌పేటలో ఎక్కువగా ఉన్నాయట. అందుకే అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే కులాల లెక్కలు.. బీజేపీ హవా కలిసి వస్తుందనే అంచనాల్లో ఉన్నారట కృష్ణయాదవ్. అయితే అంబర్‌పేట సీటు ఇవ్వడానికి బీజేపీ నిరాకరిస్తే మాజీ మంత్రి ఏం చేస్తారన్నదీ ప్రశ్నే. మరి.. ఈటల రాయబారం కృష్ణయాదవ్‌కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.