గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కారెక్కేశారు. అక్కడ కాంగ్రెస్ సీటు ఖాళీగా ఉందని భావించిన నాయకులు కర్చీఫ్‌లు వేస్తున్నారు. టికెట్ కోసం తన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి స్థాయిలో వారు కుంపట్లు రాజేస్తూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదెక్కడో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
పరస్పరం ఆధిపత్య పోరాటం
కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది కూడా కాంగ్రెస్సే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న వనమా వెంకటేశ్వరరావు.. 2018లో గెలిచింది కాంగ్రెస్ టికెట్‌పైనే. నాలుగుసార్లు హస్తం గుర్తుపైనే గెలిచారు వనమా. దాంతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న బలం.. ఓటు బ్యాంకుపై ఆశ పెట్టుకున్న నాయకులు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పరస్పరం ఆధిపత్య పోరాటానికి దిగుతున్నారట. ఐక్యంగా కలిసి సాగితే ఇంకెవరైనా లబ్ధి పొందుతారని భయపడ్డారో ఏమో.. ఎవరి కుంపటి వారిదే అన్నట్టుగా ఉంది.
కర్చీఫ్ వేస్తోన్న మాజీ ఎమ్మెల్సీ పొట్ల
కొత్తగూడెం ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో రాజకీయాల్లో వేడి కూడా పెరిగింది. మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, పార్టీ నేతలు యడవెల్లి కృష్ణ.. మరో ఇద్దరు నాయకులు సీటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పొట్ల భార్య గతంలో సుజాతనగర్ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. ఆయన కూడా టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో సుజాతానగర్ కనుమరుగైంది. కాకపోతే ఆ నియోజకవర్గ పరిధిలోని చాలా ప్రాంతాలు ప్రస్తుతం కొత్తగూడెంలో చేరాయి. అందువల్ల తనది కొత్తగూడెం నియోజకవర్గమే అని పొట్ల వాదిస్తున్నారట. సీఎల్పీ నేత భట్టి.. పీసీసీ చీఫ్ రేవంత్‌తో ఉన్న పరిచయాలను.. అవకాశాలుగా మలుచుకునే పనిలో ఉన్నారట పొట్ల నాగేశ్వరరావు.
.
రేస్‌లో వనమా తోడల్లుడు యడవెల్లి కృష్ణ..!
ఇక్కడి నుంచి నాలుగుసార్లు పోటీ చేసిన యడవెల్లి కృష్ణ సైతం కాంగ్రెస్ టికెట్ తనకే అంటున్నారు. మూడుసార్లు కృష్ణకు మూడోప్లేస్ వచ్చింది. ఎమ్మెల్యే వనమాకు తోడల్లుడు. అయినా ఇద్దరికీ పడదు. వనమాతో ఉన్న విభేదాల వల్లే కొత్తగూడెంలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రేణుగాచౌదరి వర్గానికి చెందిన నేతగా ముద్ర పడింది. పొట్ల, యడవెల్లి ప్రయత్నాలకు తోడు.. మరో ఇద్దరు స్థానిక కాంగ్రెస్ నాయకులు సైతం టికెట్ ఇస్తే పోటీ చేసి సత్తా చాటుతామని ప్రకటనలు చేస్తున్నారు. వారిలో ఒకరు ఏకంగా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి సీటు ఇవ్వాలని కోరారట. మొత్తంగా కాంగ్రెస్‌లో ఓసీ, బీసీ వర్గాల మధ్య సీటు గొడవ నిప్పు రాజేస్తోంది. ఒకవైపు టీ కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో సీనియర్లు కుస్తీ పడుతుంటే.. కొత్తగూడెంలో ఆ పార్టీ నాయకులు సైతం సీటు కోసం తన్నుకొంటున్న పరిస్థితి. సరిపోయారు మావాళ్లు అని కేడర్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.