Keshineni episode shaking Vijayawada TDP:
బెజవాడ టీడీపీలో కారు చిచ్చు రేగిందా?. ఎంపీ కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని మధ్య రాజకీయం వేడెక్కుతోందా? చిన్ని వెనక ఉండి నడిపిస్తోంది ఎవరు? నాని విషయంలో నాన్చుతోంది ఎవరు? విజయవాడ ఎంపీ సీటు కోసం హీట్ పెరుగుతోందా? అన్నదమ్ముల సవాల్‌లో ఎవరు పైచెయ్యి సాధిస్తారు?
కేశినేని నాని.. విజయవాడ టీడీపీ ఎంపీ. కేశినేని చిన్ని. టీడీపీ నేత. ఇద్దరూ సోదరులు. కానీ.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా రాజకీయ వైరం వచ్చేసింది. అది బెజవాడ టీడీపీలో అగ్గి రాజేస్తోంది. నిన్నటి వరకు కేశినేని బ్రదర్స్ మధ్య గొడవ జరుగుతోందనే స్థాయిని దాటేసి.. రోడ్డుకెక్కేశారు. రేపో మాపో తాడో పేడో తేల్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. చిన్ని పేరును నేరుగా ప్రస్తావించకున్నప్పటికీ.. ఆయన వాడుతున్న కారుకు తన పేరుతో ఉన్న నకిలీ ఎంపీ స్టిక్కర్ పెట్టుకుని విజయవాడ, హైదరాబాద్ వీధుల్లో తిరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు నాని. ఆ కారు కేశినేని నాని సోదరుడు భార్య కేశినేని జానలక్ష్మీ పేరుతో రిజిస్టరై ఉంది. దాన్ని కేశినేని చిన్ని వినియోగిస్తున్నారు. మే నెలలో ఫిర్యాదు ఇస్తే.. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బెజవాడ టీడీపీ రాజకీయాలను పట్టి కుదిపేస్తోంది.
కొంత కాలంగా బెజవాడ రాజకీయాల్లో కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ వంటి వారు రాజకీయం చేసేవారు. కార్పొరేషన్ ఎన్నికలు.. ఆ తర్వాత ఒకట్రోండు సందర్భాల్లోనూ గొడవలు బహిర్గతం అయ్యాయి. తర్వాత సద్దుమణిగినట్టు కన్పించినా.. తెరవెనక రాజకీయం అప్పటి నుంచే ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని శ్వేత నిలబెడితే.. బాబాయ్ వచ్చి ఓ రోజు ప్రచారం చేశారు. అయితే ప్రచారం చేయాల్సిన అవసరం లేదని..ఆయన్ని వెళ్లిపోవాలని నాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చిన్ని సన్నిహితుల మాట. అప్పటి నుంచి బ్రదర్స్ మధ్య అంతర్గతంగా బాంబులు పేలుతూనే ఉన్నాయట.
కేశినేని చిన్ని వెనక బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరాలు ఉన్నారనేది నాని అనుమానం. ఆ కారణంతోనే చిన్నిని దూరంగా పెట్టారనేది ఎంపీ శిబిరంలో వినిపించే మాట. ఏది ఏమైనా.. బెజవాడ టీడీపీ మాత్రం కేశినేని వర్సెస్ కేశినేని అన్నట్టుగా మారింది. ఆటోనగర్‌లో కేశినేని చిన్ని నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమంతో బ్రదర్స్ మధ్య ఉన్న బాంబ్ తొలిసారిగా బద్దలైంది. అప్పుడే వీరి మధ్య గ్యాప్ ఉందనే విషయం అందరికీ అర్థమైంది. అప్పటి నుంచే కేశినేని చిన్ని పేరు బెజవాడ రాజకీయాల్లో తరుచూ వినిపించడం మొదలైంది. ఇది కాస్త వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని కాకుండా.. కేశినేని చిన్ని పోటీకి దిగుతారనే ప్రచారం వరకు వెళ్లింది.
చిన్ని నిర్వహించిన ఓ కార్యక్రమానికి కేశినేని నానికి అనుంగు అనుచరులనుకున్న ఒకరిద్దరు వెళ్లారు. అలా వెళ్లిన వారిని కేశినేని నాని తన వద్దకు రానీయలేదు. వారిని దూరంగా పెట్టేశారు. తాజాగా ఎంపీ స్టిక్కర్ ఎపిసోడ్‌తో బ్రదర్స్ మధ్య పరోక్ష యుద్దం కాస్త.. ప్రత్యక్ష యుద్దంగా మారింది. తనను టార్గెట్ చేసినా ఫర్వాలేదు కానీ.. ఇంట్లో ఆడవాళ్లను వివాదాల్లోకి లాగడం కరెక్ట్ కాదంటూ తొలిసారిగా కేశినేని చిన్ని మీడియా ముందుకు వచ్చారు. తాను ఎటువంటి పదవి.. టిక్కెట్లు ఆశించడం లేదని కేశినేని చిన్ని చెబుతున్నా.. లోపల మాత్రం ఎవరి వ్యూహాలు వారికి ఉన్నట్టు కన్పిస్తోంది.
టీడీపీలో ఒక వర్గం చిన్నిని ఎంకరేజ్ చేస్తోందనే చర్చ జరుగుతోంది. చిటికీ మాటికీ అధిష్టానం మీద అలిగి.. తాను పోటీ చేయనని కేశినేని నాని చెబుతుంటే.. పార్టీ ప్రత్యామ్నాయాలు చూసుకోవద్దా..? అందుకే చిన్నిని ప్రోత్సహిస్తోందనే ప్రచారం పెట్టారు. చంద్రబాబు మాత్రం నాని విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఎప్పటిలా సమస్యను నాన్చే ధోరణిలోనే ఆయన ఉన్నారు. గత ఎన్నికల తర్వాత నానికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు.. కేడర్ ప్రస్తుతం దూరమయ్యారు. ఇది ఎంపీ చేసుకున్న స్వయం కృతాపరాధమేనంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిస్థితుల్లో నాని మీద అధిష్టానానికి సాఫ్ట్ కార్నర్ ఉన్న.. నాని ఆ స్థాయిలో పార్టీ పట్ల వ్యవహరిస్తున్నారా..? అనే చర్చ జరుగుతోంది. మహానాడుకు కూడా ఎంపీ వెళ్లలేదు.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అభ్యర్థి ద్రౌపది ముర్ము టీడీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంలో కేశినేని నాని అంతా తానై నడిపించారు. కార్యక్రమానికి వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు కేశినేని నాని చంద్రబాబు కారులోనే చాలా సేపు చర్చించుకున్నారు. ఆ తర్వాత కేశినేని నాని శాంతించారని అనుకున్నప్పటికీ.. తాజా ఎపిసోడ్‌తో అగ్గి ఆరలేదని స్పష్టమైంది. మరి.. ఇది రానున్న రోజుల్లో ఇంకెలా బరస్ట్ అవుతుందో చూడాలి.