Karimnagar Politics : తెలంగాణలో ప్రస్తుతం జంపింగ్ జపాంగ్‌ల టైమ్ నడుస్తోంది. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కాస్త హింట్ ఇస్తే చాలు.. కండువా కప్పడానికి క్షణం ఆలోచించడం లేదు. ఈ విషయంలో బీజేపీ గేర్ మార్చినట్టు ఆ జిల్లాలో టాక్. బీజేపీ వలకు నేతలు చిక్కుతున్నారా? చిక్కుముళ్లు ఎదురవుతున్నాయా?
కరీంనగర్ జిల్లాలో అసమ్మతి నేతలు అంతా మూకుమ్మడిగా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. అధికార టీఆర్ఎస్లో ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు.. కాంగ్రెస్‌లో అధిష్ఠానం వైఖరితో విసుగు చెంది మరికొందరు.. రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీవైపు ఆశగా చూస్తున్నారట. అలాంటి వారిపై కొంతకాలంగా జిల్లా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కొన్నాళ్లుగా టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన సంతోష్.. టీఆర్ఎస్లో చేరాక పక్కన పెట్టేశారని అనుచరులు గుర్రుగా ఉన్నారట. అందుకే బీజేపీలో అదృష్టాన్ని వెతుక్కోవాలని అనుకుంటున్నారట. మానకొండూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ సైతం టీఆర్ఎస్లో టికెట్ రాదనే బెంగతో ఉన్నారట. ఆయన కూడా బీజేపీలోకి వెళ్లేందుకు అనుచరులతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న బొమ్మ కుటుంబం సైతం పునరాలోచనలో పడిందట. ఇక్కడ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అభ్యంతరాలను కాదని.. మాజీ ఎమ్మెల్యే అలిగిరి ప్రవీణ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై సీన్ మారిపోయింది. పీసీసీ వైఖరిని తప్పుపడుతూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు శ్రీరామ్ చక్రవర్తి సిద్ధమయ్యారట. ఆయన బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి కాంగ్రెస్‌లో వర్గపోరు ఎక్కువ కావడంతో ఓదెల జడ్పీటీసీ గంటా రాములు సైతం జంప్ కొట్టడానికి రెడీగా ఉన్నారట. బీసీ కోటాలో టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని కమలనాథులకు రాములు చెప్పారట.
ఉమ్మడి జిల్లాలో గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన కొందరు నాయకులు మాత్రం.. కొత్తవారి రాకను అడ్డుకుంటున్నారట. అక్కడ పీటముడి పడటంతో చేరికలు ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. కాకపోతే జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నట్టు చెబుతున్నారు. సమయం రాగానే గేట్లు తెరుస్తామని.. అంతా వచ్చేయొచ్చని భరోసా ఇస్తున్నారట. మరి.. ప్రచారంలో ఉన్న నాయకులు గోడ మీద కాచుకుని ఉంటారో.. లేక ఉన్నచోటే సర్దుకుపోతారో చూడాలి.