ఒకరు మాజీ ఎమ్మెల్యే. ఇంకొకాయన ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్. మరొకరు పార్టీలో సీనియర్ లీడర్. ఎవరికి వారే…. ఈసారి పార్టీ టిక్కెట్ నాదేనని తెగ ప్రచారం చేసేసుకుంటున్నారు. జగన్ నాకే హామీ ఇచ్చారంటూ ఎవరి మైండ్ గేమ్ వారు ఆడుతున్నారు. మూడు రెక్కలు కలిసి తిరిగితేనే ఫ్యాన్ గాలి సక్రమంగా వస్తుందన్న సంగతి మర్చిపోయి ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా మూడు రెక్కలాట?.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఫ్యాన్‌కు ఉన్న మూడు రెక్కలు వేటికవే తిరుగుతున్నాయట. మూడు ముక్కలాటలాగా…. ఇక్కడ మూడు రెక్కలాట నడుస్తూ… పార్టీ కేడర్‌ను తీవ్ర గందరగోళంలోకి నెడుతోంది. కదిరి మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీకి బాగా.. అనుకూలమైన ప్రాంతం. ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటిగా మారిపోయింది. 2014, 19 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఇక్కడ ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరిగింది. కొత్త అభ్యర్థుల్ని పోటీకి పెట్టినా.. మంచి విజయం సాధించింది. కానీ…2024 ఎన్నికల్లో మాత్రం కూటమి వేవ్‌లో ఓటమి తప్పలేదు. ఈసారి అభ్యర్థి మార్పు మైనస్ అయిందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు నాయకుల మధ్య ఆధిపత్యపోరు జోరుగా నడుస్తోంది. ఇందులో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి మక్బూల్, పార్టీ సీనియర్ నాయకుడు పూల శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సిద్దారెడ్డిని కాదని 2024 ఎన్నికల్లో మక్బూల్‌ను తెర మీదికి తీసుకువచ్చింది పార్టీ అధిష్టానం. సిద్దారెడ్డి మీద వ్యతిరేకత ఉందని అప్పట్లో చెప్పినా… పార్టీలో చాలామంది సీనియర్ నాయకులకు అది నచ్చలేదు. ఓటమికి అది కూడా ఒక కారణమని చెప్పుకుంటారు. దాదాపు రెండేళ్ళ నుంచి మక్బూల్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. 2029లో కూడా తానే బరిలో ఉంటానని చెప్పుకొస్తున్నారాయన. ఇక రెండో నాయకుడు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా. 2014 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉండేవారు. కానీ అనూహ్యంగా ఎన్నికల ముందు వైసీపీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. అప్పుడు విజయం సాధించారు చాంద్. కానీ….. అప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో సొంత గూటికి జంప్ అయ్యారు. తర్వాతి పరిణామాలతో తిరిగి ఫ్యాన్ కిందికే చేరి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చూశారాయన. కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడిక 29 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తానే అభ్యర్థిగా ఉంటానని బల్లగుద్ది మరీ చెబుతున్నారు చాంద్ బాషా. ఆయన కూడా ప్రత్యేక వర్గంగా ఏర్పడి పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక మూడవ వ్యక్తి పూల శ్రీనివాస్ రెడ్డి. నంబులపూలకుంట మండలానికి చెందిన శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి వైసీపీలోకి కీలకంగా ఉన్నారు.
పార్టీ సీనియర్ లీడర్లలో ఆయన ప్రధామైన వ్యక్తి. గత రెండు ఎన్నికల్లో టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. ఈసారి మాత్రం అస్సలు ఛాన్స్ మిస్ అవనీయనని, 2029లో కదిరి వైసీపీ టిక్కెట్ నాదేనని ఓపెన్‌గానే చెబుతున్నారాయన. ప్రస్తుతం పార్టీలో సీఈసీ మెంబర్‌గా ఉన్న పూల శ్రీనివాసులరెడ్డి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నియోజకవర్గంలో కాకరేపాయి. మోసగాళ్లు, డబ్బులున్నోళ్లు, పారాస్యూట్స్తో దిగే వాళ్లు ఎమ్మెల్యే అభ్యర్థులు కాలేరని ఆయన అన్న మాటలు కలకలం రేపాయి. ఇలా ముగ్గరు నాయకులు ఎవరికి వారే ఈసారి టిక్కెట్ మాదేనని అంటన్నారు. అప్పుడప్పుడు జగన్‌ని నేరుగా కలుస్తూ తమకు టికెట్ హామీ వచ్చేసిందంటూ ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు. ఈ ముగ్గురిలో కూడా…. ప్రస్తుతం మక్బూల్, శ్రీనివాస్ రెడ్డి మధ్య అధిపత్యపోరు పతాక స్థాయిలో నడుస్తోందట. చాంద్ బాషా మాత్రం ఓ అవకాశం రాకపోదా అని ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మూడు ముక్కలాటతో కదిరి వైసీపీ క్యాడర్లో సందిగ్ధత ఏర్పడ్డట్టుతెలిసింది. ముగ్గురిలో సిసలైన నాయకుడు ఎవరు? మేం ఎవరి వెంట నడవాలన్నది వాళ్ళ మెయిన్ క్వశ్చన్.