పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్. ఒక వ్యక్తి రానుండటంతో పాతవాళ్లకు గుబులు పట్టుకుందట. ఒక్క సీటు కోసం ముగ్గురు పోటీపడే పరిస్థితి. పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో ఈ పొలిటికల్ వార్ ఆసక్తిగా మారింది. ఇంతకీ ఎవరా నాయకులు?
ఎర్ర శేఖర్ చేరితే జడ్చర్ల కాంగ్రెస్‌లో రచ్చేనా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లపై ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్క సీటుకే ముగ్గురు పోటీ పడే పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండగా.. కాంగ్రెస్ చేరేందుకు సిద్ధంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మూడో వ్యక్తి. ఆయన వస్తానంటే ఇక్కడ పాత నేతలకు గుబులు పట్టుకుందట. ఎర్ర శేఖర్ ఎంట్రీకి పార్టీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాకపోతే జిల్లాలో కులసమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రశేఖర్‌ను చేర్చుకునేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో ముదిరాజ్ ఓటు బ్యాంక్ ఎక్కువ. ఆ సామాజికవర్గానికి చెందిన ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీకి కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారట రేవంత్. అయితే రాజకీయంగా కలిసి వచ్చేది ఎలా ఉన్నా.. ముందుగా పార్టీలో రచ్చకు దారితీసేలా ఉన్నాయట పరిణామాలు.
మల్లు రవిని కాదని ఎర్ర శేఖర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా?
ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరితే పార్టీ టికెట్ ఆయనకే అనే చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కొన్నేళ్లుగా జడ్చర్లనే అంటిపెట్టుకుని ఉన్నారు. మరి.. ఆయన సంగతి ఏంటి? అన్నది ప్రశ్న. రేవంత్ పీసీసీ చీఫ్ కావాలని ఉత్తమ్ శిబిరం నుంచి బయటకొచ్చిన మొదటి వ్యక్తి మల్లు రవి. ఇప్పుడు రవిని కాదని ఎర్ర శేఖర్‌కు సీటు ఇస్తారా? అదే జరిగితే రవి పరిస్థితి ఏంటి? ఇంకో నియోజకవర్గానికి పంపితే ఆయన ఒప్పుకొంటారా? తేలాల్సి ఉంది.
యువనేత అనిరుధ్‌రెడ్డి పరిస్థితి ఏంటి?
మల్లు రవే కాకుండా… మరో యువ నేత అనిరుధ్‌రెడ్డి కూడా ఎన్నో రోజులుగా జడ్చర్లపై కన్నేసి ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇన్నాళ్లూ తనకే టికెట్ ఇస్తారని లెక్కలేసుకుంటున్నారట అనిరుధ్. ఆర్థికంగా, సామాజికపరంగా బలంగా ఉండటంతో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు ఈ యువనేత. ఇప్పటికే ఆ దిశగా ప్రచారం మొదలుపెట్టేశారు కూడా. దీంతో జడ్చర్ల కాంగ్రెస్ మూడుముక్కలాటలా మారుతుందేమోనని కేడర్ ఆందోళన చెందుతోందట. మరి.. ఈ పంచాయితీకి పీసీసీ ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.