పార్టీలో అత్త పదవులకు అల్లుడు గండంగా మారాడా?అల్లుడిని తీసుకురాలేని అత్తను పార్టీ లైట్ తీసుకుంటోందా?
కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి పార్టీ అప్పగించిన బాధ్యతలను తగ్గించేసింది.ఇంకా చెప్తే దాదాపు పక్కనపెట్టేసింది. దీనికి కారణాలేంటి? బీజేపీ హైకమాండ్ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంది? దీని వెనుక కారణాలేంటి?
ఆమె విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ కుమార్తె. ఆమెకు ప్రాధాన్యం ఇస్తే, ఎన్టీఆర్ కరిష్మా కలిసి వస్తుందని అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు బిజెపి ఆశపడ్డాయి. కానీ, పురంధేశ్వరి ఆ పార్టీల అంచనాలను తలక్రిందులు చేశారు. ఎన్టీఆర్ కుమార్తెగా ఏపీలో చక్రం తిప్పేస్తారని అనుకుంటే, ఆమె నామ్ కే వాస్తేలా మారిపోయారట. పదవులు తీసుకోవటం తప్ప, వాటికి న్యాయం చేయకపోవటంతో..ఇక ఆమెకు ప్రాధాన్యం అనవసరం అనే నిర్ణయానికి వచ్చిందట బిజెపి.
రాజకీయ అనుభవం లేకున్నా, అన్నగారి కూతురిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రమంత్రిని చేస్తే, బిజెపి జాతీయ స్థాయి పార్టీ పదవులు, రాష్ట్రాలకు ఇంచార్జ్ గా నియమించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టున్న ప్రాంతాల్లో ఆ పట్టును నిలుపుకోవడం.. పట్టు లేని ప్రాంతాల్లో పట్టు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ చకచకా పావులు కదుపుతోంది. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇన్ చార్జులను.. సహ ఇన్ఛార్జులను నియమించారు.. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన పురంధేశ్వరికి పార్టీ పెద్దలు గతంలో అప్పగించిన బాధ్యతల నుంచి ఓ చోట తప్పించారు. మరో చోట డిమోషన్ ఇచ్చారు.
పురందేశ్వరిని వరుసగా రెండు రాష్ట్రాల బాధ్యతల నుంచి తొలగించింది హైకమాండ్. చత్తీస్ ఘడ్ రాష్ట్ర ఇన్ చార్జ్ బాధ్యతలనుండి తప్పించి,
ఒడిషాలో డిమోషన్ ఇచ్చి.. ఇంచార్జ్ నుంచి సహ ఇంచార్జ్‌గా కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరం చూస్తుంటే గత కొన్ని రోజుల నుంచి పురంధేశ్వరి తీరు పట్ల పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్టే కన్పిస్తోంది.
కీలక బాధ్యతల నుంచి పురంధేశ్వరిని తప్పించడంపై ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తే, ఆ రెండు చోట్ల ఆమె ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప.. పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయలేదని అంటున్నారు. మరోవైపు ఏపీలో కూడా పురంధేశ్వరి వ్యవహర శైలిపై పార్టీ అధినాయకత్వం గుర్రుగా ఉందనేది సమాచారం. పురందేశ్వరి అధ్యక్షతన ఏపిలో విస్తృత చేరికల కమిటీ ఏర్పాటు చేసినా ఆమె వైపు నుంచి చొరవ ఎంత మాత్రం లేదనే భావన వ్యక్తమవుతోంది. పురంధేశ్వరికి ఆ బాధ్యతలు అప్పజెప్పిన కొత్తల్లో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు వస్తాయని బీజేపీ అధినాయకత్వం అంచనా వేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో జరగలేదు. టీడీపీ అనే కాకుండా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కూడా బీజేపీలోకి రప్పించడంలో పురంధేశ్వరి అంతగా ఇంట్రస్ట్ చూపడం లేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పురంధేశ్వరీకి ఇంకా కీలక బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం లేదనే భావనతో ఆ పార్టీ అధినాయకత్వం ఉన్నట్టు సమాచారం. సొంత రాష్ట్రంలో.. పరిచయం ఉన్న వ్యక్తులనే ప్రభావితం చేయలేకపోయిన పురంధేశ్వరీ.. పక్క రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఏం చేస్తారనే భావన పెరిగిందట
అయితే ఇది పైకి కన్పించే వ్యవహరమని.. అసలు విషయం వేరే ఉందని మరో చర్చ జరుగుతోంది. అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలోనే పురంధేశ్వరికి ఇంపార్టెన్స్ తగ్గిపోయిందనే చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ తర్వాత చాలా ఊహాగానాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి ప్రచారం చేస్తారని, ఏపీ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా మారబోతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి తగ్గట్టే సోము వీర్రాజు కూడా పదే పదే జూనియర్ ప్రస్తావన తెచ్చారు. అయితే తెర వెనుక మాత్రం వేరే జరిగిందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి తాను రాలేనని.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని నేరుగా అమిత్ షాకో.. లేక బీజేపీ పెద్దలకో చెప్పేశారని అంటున్నారు. జూనియర్ అలా చెప్పడమే.. ఇప్పుడు పురంధేశ్వరి డిమోషన్‌కు కారణమనే ఆసక్తికర చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
పార్టీ బలోపేతం కోసం వీసమెత్తు చొరవ చూపని పురంధేశ్వరి, కనీసం మేనల్లుడిని పార్టీ వైపు మళ్లించటంలో కూడా విఫలమయ్యారనే భావన ఉండడం వల్లే.. పార్టీ అధినాయకత్వం ఈ తరహా చర్యలు తీసుకుని ఉండొచ్చనేది నడుస్తున్న తాజా టాక్. ఓ విధంగా చెప్పాలంటే మేనల్లుడి ఎఫెక్ట్ పురంధేశ్వరి మీద పడిందని పార్టీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ అంశంమే కారణం కాకపోవచ్చని.. అలాంటిదేదైనా ఉంటే.. సోము వీర్రాజు ఎన్టీఆర్ జపం ఎందుకు చేస్తారని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.