జనసేనాని టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారా? వైసీపీని ఓడించడమే లక్ష్యమన్న పవన్ కల్యాణ్.. ఆ పార్టీలో తన పర్సనల్ టార్గెట్స్ లక్ష్యంగా పని మొదలు పెట్టారా? ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూ.. ఆ నియోజకవర్గం నుంచే తొలి సమీక్షను మొదలు పెట్టడం వెనుక అసలు ఉద్దేశం శత్రువు ఓటమేనా..?
దసరా నుంచి ప్రారంభించాల్సిన బస్ యాత్రను వాయిదా వేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధం అవుతున్నారు. సంస్థాగతంగా పార్టీ శక్తిసామర్ధ్యాలు తెలుసుకోవడంతోపాటు…. ఎన్నికలకు పార్టీని సెట్ చేయడానికి వీలుగా సమీక్షలు చేస్తామని ప్రకటించారు పవన్. వచ్చే నెలలో మొదలయ్యే ఈ సమీక్షకు మొదటి నియోజకవర్గంగా విజయవాడ పశ్చిమను జనసేనాని ఫిక్స్ చేశారు.
సహజంగా ఎన్నికలకు ముందు పార్టీలన్నీ సమీక్షలో పర్యటనలో పెట్టుకుంటూనే ఉంటాయి. అందులో ఆశ్చర్యం ఏం ఉండదు. అయితే కొన్ని నియోజకవర్గాలను… అక్కడ ఉన్న ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తూ పెట్టే సమావేశాలు, సభలు, సమీక్షలకు కొంత ఆసక్తి ఉంటుంది. టీడీపీనే కాదు… చంద్రబాబునే ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉన్న సీఎం జగన్ కుప్పం టార్గెట్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 22న జగన్ అక్కడ పర్యటించబోతున్నారు. ఇది ఏపీ పాలిటిక్స్ లో అటెన్షన్ డ్రా చేసింది.
అలాగే… ఇప్పుడు పవన్ కల్యాణ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే 2024 ఎన్నికల పని మొదలు పెట్టడంతో అక్కడే ఎందుకు? అనే సందేహం అందరిలోనూ వచ్చింది. విషయం ఏంటంటే… ఆ నియోజకవర్గం మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ది. మంత్రిగా ఉండగా పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు వెల్లంపల్లి. 2009లో ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీలో చేరిన తర్వాత పవన్ పై వెల్లంపల్లి చేస్తున్న విమర్శలకు దీనితోనే జనసైనికులు కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో సీటు కోసం… గెలిపించడం కోసం పవన్ కాళ్లా వేళ్లా పడ్డ వెల్లంపల్లి ఇప్పుడు ప్లేట్ మార్చారని ట్రోల్ చేశారు. అంతేకాదు… 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెల్లంపల్లి… విజయవాడ ప్రచారానికి వెళ్లిన పవన్ వెంటపడి…. తనను గెలిపించాలని ఓ సందేశం ఇవ్వాలని కోరిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారు. అది చూసిన వెల్లంపల్లి అన్ననే గెలిపించని వాడు… బీమవరం, గాజువాకలో గెలవని వాడు తనను గెలిపించడమా? అంటూ పవన్‌ను ఎద్దేవా చేశారు.
అప్పట్లో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి… జనసేనాని పవన్‌కు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా విమర్శలు చేసేవారు. ఇది జనసైనికుల్లోనే కాదు… జనసేనాని మైండ్ లో బాగా ఫిక్స్ అయినట్టుంది. అందుకే … వెల్లంపల్లి ఓటమి టార్గెట్ గా అతని నియోజకవర్గం నుంచే పార్టీ సమీక్షలు మొదలు పెట్టబోతున్నారట జనసేనాని. 2014 ఎన్నికల్లో టీడీపీ బలపరచిన బీజేపీ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ మీద ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి పోతిన మహేష్ కు అక్కడ 22వేల 367 ఓట్లు వచ్చాయి. JSP రెబల్ అభ్యర్ధగా పోటీ చేసిన కోరాడ కు 12 వేల ఓట్ల వరకు వచ్చాయి. టీడీపీకి 50 వేల ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెల్లంపల్లికి 58వేల ఓట్లతో దాదాపు 8 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈ లెక్కలే ఇప్పుడు జెఎస్పీలో ఆశలు రేపుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే కాస్త గట్టిగా కాన్సన్‌ట్రేషన్ చేస్తే చాలు వెల్లంపల్లిని ఓడించవచ్చనేది ఆ పార్టీ ఆలోచనట. ఒకవేళ టీడీపీ, బీజేపీతో కలిస్తే ఆ పని ఇంకా ఈజీ అవుతుందనేది జనసేన లెక్క. అందుకే ఆ నియోజకవర్గం నుంచే పవన్ సమీక్షలు స్టార్ట్ చేస్తున్నారట. విజయవాడ పశ్చిమ సమీక్ష తర్వాతి జాబితాలో పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాలే ఉంటాయట.