ఆయన ఏదో ఈక్వేషన్‌తో ఈయనకు మద్దతు ఇచ్చారు. ఈయన గెలిచేశారు. అంతా బాగానే ఉంది. ఈయనేమో.. నేను అప్పుడు అయన అల్లుడికి అంత నష్టం చేసినా… ఆయన మాత్రం మమ్మల్ని గెలిపించారు అంటూ కొత్త మంట పెట్టారు. అక్కడి వరకే పరిమితమైన ఆ ‘మా’ గొడవ ఇప్పుడు రాజకీయంగా తమను ఎక్కడ ఇరకాటంలోకి నెడుతుందోనని ఆ పార్టీ నేతలు గిజగిజ కొట్టేసుకుంటున్నారట.
మోహన్‌బాబు కామెంట్స్‌తో ఇరకాటంలో టీడీపీ..!
మా ఎన్నికల రచ్చ ఏపీ టీడీపీని తాకింది. మా ఎన్నికల హడావుడి.. ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం.. దుమ్మెత్తిపోసుకోవడం వంటి అంశాల్లో టీడీపీ ఎక్కడా జోక్యం చేసుకోలేదు. తెరవెనక బాలయ్య మంచు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారనే విషయం తెలిసినా.. సినిమా వ్యవహారం తామెందుకు జోక్యం చేసుకోవాలని టీడీపీ కూడా గమ్మున ఉండిపోయిందట. మా ఎన్నికల్లో ప్రెసిడెంటుగా విష్ణు విజయం సాధించాక.. ఇండస్ట్రీ పెద్దలలో ఒక్కొక్కర్ని కలిసే క్రమంలో మోహన్ బాబు, విష్ణు ఇద్దరూ బాలయ్యతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీని ఇరుకున పెడుతున్నాయట.
మంగళగిరి అంశాన్ని మోహన్‌బాబు ఎందుకు ప్రస్తావించారు?
సాధారణ ఎన్నికల్లో లోకేష్‌ను ఓడించేందుకు ప్రచారం చేశానని.. అయినా ఆ విషయం మరిచిపోయి బాలయ్య తన కుమారుడికి సపోర్ట్ చేయడం మంచి పరిణామం అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ టీడీపీ నేతల్లో విపరీతంగా చర్చకు దారి తీస్తోంది. జగన్‌కు సపోర్ట్ చేసిన మోహన్‌బాబుకు మా ఎన్నికల్లో బాలయ్య సపోర్ట్ చేసినా.. మెగా కాంపౌండుకు వ్యతిరేకంగా పని చేసినా.. సినిమాకు సంబంధించిన అంశం కాబట్టి తామేం అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తు చేస్తున్నారు. కానీ మా ఎన్నికలు ముగిశాక సాధారణ ఎన్నికల్లో లోకేష్‌ను ఓడించేందుకు ప్రచారం చేశాననే పాత విషయాన్ని మోహన్‌బాబు ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నిస్తున్నారు పలువురు నేతలు. మోహన్‌బాబు ఏదో యధాలాపంగా ఈ కామెంట్లు చేశారని భావించలేమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారట ఆ నాయకులు.
పవన్, జనసేనలకు మంటపుట్టించేలా కామెంట్స్ ఉన్నాయా?
ఇప్పుడిప్పుడే రాజకీయంగా పవన్ కల్యాణ్‌కు టీడీపీకి దగ్గరవుతున్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకునే దిశగా అడుగులు పడుతున్న సమయంలో మెగా ఫ్యామిలీకి.. మరి ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు టీడీపీ తీరు మీద ఆగ్రహం తెప్పించేలా మోహన్‌బాబు కామెంట్స్ ఉన్నాయని భావిస్తున్నారట. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి పొలిటికల్ సిచ్యుయేషన్‌లో పవన్‌కు.. జనసేనకు.. మరి ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి మంట పుట్టించేలా మోహన్‌బాబు మాటలుఉన్నాయని టీడీపీ నేతలు రుసరుసలాడుతున్నారు.
టీడీపీ-జనసేన దగ్గర కాకుండా కామెంట్స్ చేశారా?
మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీని ఓడించేందుకు.. వైసీపీ, తెలుగుదేశం.. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు ఏకమై పని చేశాయనే విషయం కాపు సామాజికవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోందట. ఇప్పటి వరకు ఇదంతా సినిమా పరిశ్రమకే పరిమితమైంది. రాజకీయంగా పెద్దగా ఇబ్బంది ఉండదని భావించామని.. కానీ ఇప్పుడు సాధారణ ఎన్నికలు.. లోకేష్ ఓటమి వంటి విషయాలను ప్రస్తావించడం ద్వారా టీడీపీకి.. బాలయ్యకు ఇబ్బందులు తెచ్చేలా కూడా మోహన్‌బాబు కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల ముందు ఫీజు రీయింబర్సుమెంట్ విషయంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అని నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారట తమ్ముళ్లు. ఇప్పుడు జగన్ సర్కార్ వచ్చాక.. గతానికంటే ఎక్కువగా మోహన్‌బాబు తన విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధుల విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతోన్నా.. కిమ్మనకుండా ఉన్నారని అనుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ-జనసేన దగ్గర కాకుండా చూసేందుకు మోహన్‌బాబు లోకేష్ ఓటమి గురించి ప్రస్తావించారని అనుమానిస్తున్నారట. మరి..రాజకీయంగా ఏం జరుగుతుందో చూడాలి.