ఆ మాజీ మంత్రి ఇంటిపోరుతో సతమతం అవుతున్నారా? రాష్ట్రస్థాయిలో పార్టీలో కీలకంగా ఉన్నా.. సొంత నియోజకవర్గంలోని పరిణామాలు రుచించడం లేదా? కొత్త తలనొప్పులు వస్తున్నాయా? ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ?
జహీరాబాద్ కాంగ్రెస్‌లో గ్రూపులతో వేగలేకపోతున్నారా?
ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గీతారెడ్డి. అంతకుముందు గజ్వేల్‌లో సత్తా చాటారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా జహీరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గత ఎన్నికల్లో గీతారెడ్డిని ఓటమి పలకరించింది. ముగ్గురు సీఎంల దగ్గర పదేళ్లపాటు మంత్రిగా చక్రం తిప్పినా.. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులతో వేగలేకపోతున్నారట.
గీతారెడ్డి వ్యతిరేకవర్గానికి అజారుద్దీన్ అండ?
ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు గీతారెడ్డి. పార్టీలో రాష్ట్రస్థాయి హోదా ఉన్నప్పటికీ జహీరాబాద్‌లోని పరిస్థితులే ఆమెకు మింగుడు పడటం లేదట. నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలేవీ ఈ మాజీ మంత్రికి తెలియకుండానే జరిగిపోతున్నాయట. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని సమాచారం. గీతారెడ్డి హాజరైతే.. ఆ కార్యక్రమానికి కేడర్ వెళ్లకుండా ఒక వర్గం నియంత్రిస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. జహీరాబాద్ కాంగ్రెస్‌లో డీసీసీబీ మాజీ ఛైర్మన్ జైపాల్‌రెడ్డి, నరోత్తం.. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌మోహన్‌రావులది వేరే వర్గం. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఉన్నారు. గీతారెడ్డి వ్యతిరేకవర్గమంతా అజారుద్దీన్ సాయంతో పనులు కానిస్తున్నట్టు ఇక్కడ ఓపెన్‌గానే చెప్పుకొంటారు.
వ్యతిరేకవర్గం చేస్తున్న పనులపై గీతారెడ్డి గుర్రు..!
గత నెలలో రేవంత్ టీం వర్సెస్ అజారుద్దీన్ టీంల మధ్య జహీరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నిర్వహణ విషయం గీతారెడ్డికి తెలియదట. చివరి నిమిషం వరకు ఆమె రారు అనే ప్రచారం జరిగింది. దీనిపై ఆమె గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె గుర్రుగా ఉన్నారట. నరోత్తం గతంలో టీడీపీ తరపున గీతారెడ్డిపై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2018లో బరిలో ఉండడానికి చివరివరకు ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు.
మీటింగ్స్ సమాచారంపై వ్యతిరేకవర్గం వ్యంగ్యాస్త్రాలు..!
గత నెలలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పార్లమెంటరీస్థాయి సమావేశం జహీరాబాద్‌లో నిర్వహించారు. ఆ సమావేశంలో సైతం గీతారెడ్డి పెద్దగా ఇన్వాల్వ్ కాలేదట. పార్లమెంటరీ స్థాయి సమావేశం గురించి గీతారెడ్డికి చెప్పాల్సిన పనిలేదని ఆమె వ్యతిరేక వర్గం వాదన. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు చెప్పినప్పుడు వెల్లడిస్తే సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారట. మేడం రాష్ట్రస్థాయిలో బిజీగా ఉంటున్నారని.. నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తామే చూసుకుంటున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట.
తన నియోజకవర్గంలో వ్యతిరేకవర్గానికి పార్టీ పెద్దలు సపోర్ట్ చేయడం గీతారెడ్డికి అస్సలు రుచించడం లేదు. అందుకే రానున్న రోజుల్లో ఈ గ్రూప్ ఫైట్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనే చర్చ కాంగ్రెస్‌లో ఉంది. మరి జహీరాబాద్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో చూడాలి.