మిషన్ ఇంపాజిబుల్‌లో తెలంగాణ బీజేపీ నేతలది కీలక పాత్రా..? లక్ష్మణ్‌కు దక్కిన ప్రాధాన్యం అందులో భాగమా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ సమీకరణాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి?
బీజేపీ కేంద్ర నాయకత్వంలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల నిర్ణయాలు తీసుకోవడం చర్చగా మారుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలనే వ్యూహంలో భాగంగా చకచకా పావులు కదుపుతోంది అధిష్ఠానం. కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిషన్‌లలో రాష్ట్ర బీజేపీ నేతలకు చోటు కల్పించింది అగ్రనాయకత్వం. హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఆ దూకుడు ఇంకా పెరిగిందనే చెప్పాలి. కాకపోతే అందులోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం.. కమలనాథులనే ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి.
తాజాగా డాక్టర్ కె. లక్ష్మణ్‌కు.. బీజేపీ అత్యున్నత నిర్ణయాక మండలి పార్లమెంటరీ కమిటీతోపాటు.. ఎన్నికల కమిటీలోనూ చోటు ఇచ్చారు. ఇటీవలే ఆయన్ని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. ఇప్పుడు కొత్త బాధ్యతల్లోకి తీసుకున్నారు. దీంతో లక్ష్మణ్‌కు ఇస్తున్న ప్రాధాన్యంపై పార్టీలోనే పెద్ద చర్చగా మారింది. గతంలో బీజేపీ శాసన సభాపక్ష నేతగా… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెల్చినా.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో పార్టీ పుంజుకుంది. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన తర్వాత లక్ష్మణ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపించాయి. ఇంతలోనే బీజేపీ OBC మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పేరును ప్రకటించడంతో.. అనూహ్యంగా పొలిటికల్ టర్న్ వచ్చింది. అప్పటి నుంచి జాతీయ నాయకుడిగా దేశమంతా పర్యటనలు చేస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ తీరిక లేకుండా గడిపారు.
తెలంగాణలో బీసీలు ఎక్కువ. అందులో మున్నూరు కాపు సామాజికవర్గం కూడా ఎక్కువే. లక్ష్మణ్ అదే సామాజికవర్గం. రాష్ట్రంలో బలపడటానికి బీసీలు కీలకంగా పరిగణిస్తున్న బీజేపీ ఆ వర్గానికి చెందిన వారికి పదవులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ కూడా అదే సామాజికవర్గం. దాంతో రాష్ట్రంలో బీసీలకు బీజేపీ దగ్గరనే సంకేతాలు ఇస్తున్నారు కమలనాథులు. బీజేపీ అత్యున్నత నిర్ణయాక మండలిలో చోటు మామూలు విషయం కాదన్నది పార్టీ నేతలు చెప్పేమాట. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ ఆ కమిటీలో ఉండేవారు. తర్వాత వెంకయ్య నాయుడు వంతు వచ్చింది. ఇప్పుడు లక్ష్మణ్ టర్న్ రావడంతో.. తెలంగాణ నుంచి ఎంపికైన తొలి నేతగా పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు. బీజేపీలో కాంట్రవర్సీ కాకపోవడం.. పార్టీలో అందరూ ఆయన్ని గౌరవించడం కూడా లక్ష్మణ్‌కు ప్లస్ అయ్యిందని టాక్.
బీజేపీలో పదవులు వస్తేనే సంబరం కాదు. ఆమేరకు పనితనం కూడా చూపించాలి. ఆ సమర్థత లక్ష్మణ్‌కు ఉందని జాతీయ నాయకత్వం గుర్తించినా.. తెలంగాణలో బీజేపీ బలపడేలా చేయడం మిషన్ ఇంపాజిబుల్‌గానే కాషాయ వర్గాలు భావిస్తున్నాయి. మరి.. బీజేపీ ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని లక్ష్మణ్ ఏవిధంగా చేరుకుంటారో కాలమే చెప్పాలి.