నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కో నేతది ఒక్కో ప్రత్యేకత. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఆ ఎమ్మెల్యే శైలి భిన్నం. స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా ఉంటారు. ఆ వైఖరి వెనక ఏదో మతలబు ఉందనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథా?
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. వరసగా రెండోసారి గెలిచారు. విద్యార్ధి దశలో ABVP నాయకుడిగా పనిచేస్తే.. రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్ నేతగా ఎదిగి.. ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు శ్రీధర్‌రెడ్డి. ప్రజల అటెన్షన్ కోసమో ఏమో.. వినూత్న నిరసనలు చేపడుతుంటారు. విపక్షంలో ఉన్నా.. ఇప్పుడు అధికరపక్షంగా మారినా ఆయనలో ఎలాంటి మార్పు లేదన్నది పార్టీ వర్గాల మాట. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఆశించారు. కానీ.. ఛాన్స్ దక్కలేదు. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలోనూ ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నట్టు ఓపెన్‌గానే చెప్పేశారు శ్రీధర్‌రెడ్డి. కానీ.. జిల్లా నుంచి కాకాణి గోవర్దన్‌రెడ్డికి అవకాశం ఇవ్వడంతో .. మీడియా ముందుకొచ్చి ఎక్కి ఎక్కి ఏడ్చేశారు. పార్టీలో తనకంటే సీనియర్ ఎవరు అని ప్రశ్నలు సంధించారు ఈ ఎమ్మెల్యే. అప్పటి నుంచి రూటు మార్చేసి.. స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు శ్రీధర్‌రెడ్డి.
నేరుగా ప్రభుత్వానికి గురిపెట్టరు. కానీ.. అధికారుల తీరుతో నష్టం జరుగుతోందని శ్రీధర్‌రెడ్డి కస్సుమంటారు. గడువులోగా పనులు జరగకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించడం ఆయనకే చెల్లింది. ప్రతి సమావేశంలో ఆయన తీరు గతకంటే కాస్త భిన్నంగా కనిపిస్తోందట. ఆ మధ్య ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్యపై కాలువలోకి దిగి నిరసన తెలిపారు. అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఇలా రోడ్డెక్కడం.. చిర్రుబుర్రులాడటం వైసీపీ నేతలకు ఇబ్బందిగా మారుతోందట. జడ్పీ సమావేశాలతోపాటు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో విపక్ష పాత్ర పోసిస్తున్నట్టుగా శ్రీధర్‌రెడ్డి వైఖరి ఉంటోందట.
జగనన్న కాలనీ లేఅవుట్ విషయంలో అధికారిక సమావేశంలోనే కస్సుమన్నారు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి. మూడునెలల్లో లేఅవుట్ భూమిని చదును చేయకపోతే నిరసన తప్పదని వార్నింగ్ ఇచ్చేశారు. ఇదే కాదు.. నెల్లూరులోని రోడ్లపై ఏర్పడ్డ గుంతలు పూడ్చకపోతే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్‌ను ముట్టడిస్తానన్నారు శ్రీధర్‌రెడ్డి. ఇలా ప్రతి అంశంలోనూ ఇతర వైసీపీ ఎమ్మెల్యేల కంటే భిన్నంగా వెళ్తున్నారు.
పైకి అధికారులపై విమర్శలు చేస్తున్నట్టు కనిపిస్తున్నా.. శ్రీధర్‌రెడ్డి లక్ష్యం ఇంకేదో ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారట. తన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని తెలిసినా.. వెనక్కి తగ్గకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా రాజకీయంగా మరింత బలపడేందుకు చేస్తున్న ప్రయత్నంగా కొందరు భావిస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో సీటు రాదన్న సంకేతాలతో ఏదేదో చేస్తున్నారని వాదించే వాళ్లూ ఉన్నారు. మొత్తానికి స్వపక్షంలో విపక్షంగా మారిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో