హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో పులి వరుస దాడులకు తెగబడుతుండటంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాదాద్రి జిల్లాలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ , బేగంపేట అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. జనవరి 26వ తేదీన దత్తాయపల్లి గ్రామ పరిధిలో ఒక లేగదూడపై దాడి చేసిన పులి, దానిని చంపి తినేసింది. ఆ తర్వాత మరో ఆవు , దూడ కూడా కనిపించకుండా పోవడం, వాటిపై కూడా పులి దాడి చేసినట్లు ఆనవాళ్లు లభించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 5 పశువులు పులికి ఆహారమైనట్లు సమాచారం.
పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జంతువు కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు అడవిలో పలు రకాల ఏర్పాట్లు చేశారు. అడవిలో పులి తిరిగే ప్రధాన మార్గాల్లో సుమారు 22 మోషన్ కెమెరాలను అమర్చారు. దట్టమైన అడవిలో పులి ఎక్కడ నక్కి ఉందో కనిపెట్టడానికి అత్యాధునిక థర్మల్ డ్రోన్లను రంగంలోకి దించారు. ఇవి శరీర ఉష్ణోగ్రత ఆధారంగా జంతువులను గుర్తిస్తాయి. పులి పాదముద్రలు కనిపించిన రెండు ప్రధాన ప్రాంతాల్లో పెద్ద బోన్లను ఏర్పాటు చేశారు. పులిని ఆకర్షించేందుకు ఆ బోన్లలో మేకలను ఎరగా ఉంచారు.
పరిస్థితి తీవ్రతను బట్టి జిల్లా అటవీ శాఖ అధికారులు (DFO), ఎంఆర్ఓ , పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. దత్తాయపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. రైతులు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, పశువులను అడవి వైపు తోలవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని సురక్షితంగా పట్టుకుని టైగర్ రిజర్వ్ జోన్‌కు తరలించే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.