హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ బరిలో దిగుతారా? పోటీకి ఆమె సుముఖంగానే ఉన్నారా? మరి.. పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో కొండా అనుచరుల పరిస్థితి ఏంటి? ఉపఎన్నికలో పోటీ వెనక కొండా దంపతుల ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా? ప్రయోగం ఫలితాన్నిస్తుందా?
కొండా సురేఖ బరిలో ఉంటే త్రిముఖ పోరుగా కాంగ్రెస్ అంచనా?
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు బీసీ మంత్రం ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీసీ కార్డునే ప్రయోగించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ బరిలో దించనున్నట్టు సమాచారం. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్.. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సురేఖను వ్యూహాత్మకంగా బరిలో దింపుతున్నట్టు తెలుస్తోంది. హుజురాబాద్‌లో దళిత సామాజికవర్గం తర్వాత మున్నూరు కాపు సామాజికవర్గ ఓటర్లు 28 వేలు.. పద్మశాలీ సామాజికవర్గం ఓటర్లు 18 వేల వరకు ఉన్నారు. కొండా దంపతుల్లో మురళీ కాపు సామాజికవర్గం కాగా.. సురేఖ పద్మశాలీ సామాజివర్గానికి చెందిన వ్యక్తి. ఈ విధంగా ఆ రెండు వర్గాల ఓట్లు తమ ఖాతాలో పడతాయని అనుకుంటున్నారట కాంగ్రెస్ నాయకులు. అలాగే టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ కాకుండా.. త్రిముఖ పోరుగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.
కొండా దంపతులతో టచ్‌లో ఉన్న హుజురాబాద్ ప్రజలు, నేతలు!
హుజురాబాద్ నియోజకవర్గానికి వరంగల్ జిల్లాలో సంబంధాలు ఎక్కువ. హుజురాబాద్‌లోని కమలాపురం మండలం వరంగల్ జిల్లా పరిధిలోనే ఉంది. గతంలో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాలకు ఆనుకునే హుజురాబాద్ ఉంటుంది. సురేఖ గతంలో మంత్రిగానూ పనిచేశారు. ఆమె భర్త మురళీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ విధంగా హుజురాబాద్ ప్రజలు, నాయకులు కొండా దంపతులతో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.
ఉపఎన్నికలో పోటీ ద్వారా కొండా దంపతులు కొత్త ఎత్తుగడ!
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్.. కొండా సురేఖ అభ్యర్థిత్వంవైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సురేఖ హుజురాబాద్‌లో పోటీ చేస్తే.. ప్రస్తుతం వాళ్లు రాజకీయం చేస్తున్న పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్న. అయితే ఇక్కడ ఇంకో చర్చ జరుగుతోంది. ఎక్కడైనా తమకు బలం ఉందని చాటుకోవడానికి హుజురాబాద్ ఉపఎన్నికను కొండా దంపతులు ఉపయోగించుకోవచ్చు అని భావిస్తున్నారు. అక్కడ గౌరవ ప్రదమైన ఓట్లు సాధిస్తే.. ఆ ప్రభావంతో వరంగల్ జిల్లాలో తమకు వెయిట్ పెరుగుతుందని అనుకుంటున్నారట.
కాంగ్రెస్‌లో తమ సత్తా చాటుతారా?
కొండా సురేఖ దంపతులు తొలుత కాంగ్రెస్‌లో ఉండేవారు. తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఆపై టీఆర్‌ఎస్‌లోనూ కొన్నాళ్లూ కొనసాగారు. 2018 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చి.. పరకాల నుంచి పోటీ చేసి సురేఖ ఓడిపోయారు. ఒకప్పుడు వరంగల్ రాజకీయాను శాసించిన కొండా దంపతులు ప్రస్తుతం స్తబ్దుగా ఉండిపోయారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక… వీరిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయట. ప్రస్తుతం పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఎదుర్కోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు కొండా దంపతులు. ఇప్పుడు హుజురాబాద్‌లో పోటీ చేయడం వల్ల మళ్లీ చురుకైన పాత్ర పోషించవచ్చని అనుకుంటున్నారట. తమ సత్తా ఏంటో కాంగ్రెస్‌కు తెలియజేసే అవకాశం కూడా దక్కుతుందనే లెక్కలూ ఉన్నాయట. రాజకీయాల్లో ప్రయోగాలు ఫలిస్తే ఆ కిక్కే వేరు. వికటిస్తే మాత్రం కోలుకుంటారో లేదో చెప్పలేం. మరి.. హుజురాబాద్‌లో కొండా దంపతులకు ఏం జరుగుతుందో చూడాలి.