ఫలితం అనుకూలంగా ఉంటే అంతా మా కృషే అని చంకలు గుద్దుకుంటారు. తేడా కొడుతుందని అనుమానం వస్తే మాత్రం దూరం జరుగుతారు. హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలోనూ ఆ పార్టీలో అదే జరుగుతోందట. టచ్‌మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట నాయకులు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
హుజురాబాద్‌పై చర్చకు ఇష్టపడని కాంగ్రెస్ నేతలు!
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఎదో ఒక పంచాయితీ ఉంటూనే ఉంటుంది. సభలు సమావేశాలపై తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మీరు అలా ఎలా చేస్తారు? అనే ప్రశ్నలు కామన్. కాంగ్రెస్‌కు సవాల్‌గా నిలిచిన హుజురాబాద్ ఉపఎన్నికలోనూ ఎవరికి వారు మనకెందుకులే ఆ తలనొప్పి అని అనుకుంటున్నారట. హుజురాబాద్ చర్చకు వస్తే ఏదో ఒక సాకు చెబుతూ సైడ్ అవుతున్నట్టు సమాచారం. ఈ నాయకుడు.. ఆ నాయకుడు అని కాదు.. అందరిదీ ఇదే వరస.
టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాతే కాంగ్రెస్ క్యాండిడేట్ వెల్లడి?
హుజూరాబాద్ ఉపఎన్నిక తేదీ ఇంకా రాలేదు. బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకత్వాలు అక్కడ ప్రచారం ఊదరగొడుతున్నాయి. చర్చలో లేనిది కాంగ్రెస్సే. ఈ మధ్యనే ఉపఎన్నిక కోసం హుజురాబాద్‌లో మండలాల వారీగా ఇంఛార్జిలను నియమించింది. మొత్తం ఉపఎన్నిక ఇంఛార్జ్‌గా దామోదర రాజనర్సింహ మండల పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్ధి ఎంపికలో మాత్రం ఆయన అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా తొందరెందుకు? టీఆర్‌ఎస్ ఇంకా క్యాండిడేట్‌ను ప్రకటించలేదుగా అంటున్నారట. అయితే ప్రతీసారి కాంగ్రెస్ ఇదే పొరపాటు చేస్తుందన్నది కొందరు కాంగ్రెస్ నాయకుల అభ్యంతరం. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో రేవంత్ మాట్లాడినా.. ఆయన టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారు.
Read Also : సోడాల శ్రీదేవి వచ్చేసింది.. సూరిబాబు హ్యాపీ !
గత ఉపఎన్నికల నుంచి నేర్చుకున్నది ఏదీ లేదా?
ఉపఎన్నికల్లో అధికారపార్టీ జనంలోకి వెళ్లి.. అన్ని వర్గాలను తనవైపు తిప్పుకున్న తర్వాత కాంగ్రెస్ నాయకులు జెండా పట్టుకుని బయలు దేరతారనే చర్చ పార్టీలో ఉంది. అప్పటికే జనం.. క్షేత్రస్థాయి నాయకులు కమిటై ఉంటారు. హుజూర్ నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక ఉపఎన్నికల్లో జరిగింది అదే. వీటి నుంచి నేర్చుకుంది ఏదీ లేదన్నట్టుగా ఉంది నేతల తీరు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీలను అన్నిరకాలుగా ఎదుర్కోవడం కొంత కష్టమే. అయినప్పటికీ ఉపఎన్నిక వ్యూహ రచనలో వెనకా ముందు ఆలోచించడం ఏంటన్నది గాంధీభవన్ వర్గాల ప్రశ్న. నియోజకవర్గంలో నాయకులు పర్యటిస్తూ.. ప్రచారం చేస్తే కనీసం క్యాడర్‌కు ధైర్యంగా ఉంటుంది. ఇతర పార్టీలు అంతా సర్దేసిన తర్వాత.. వెళ్లితే ప్రయోజనం ఏంటని కొందరు నిలదీస్తున్నారు.
ఠాగూర్‌తో జరిగే భేటీలో అభ్యర్థిపై చర్చ!
హుజురాబాద్ ఉపఎన్నికలో క్రియాశీలకంగా పనిచేయడానికి ఎంత మంది కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారన్నది కూడా అంతుచిక్కడం లేదట. ఈ విషయంలో రేవంత్ ఎత్తుగడలు రేవంత్‌వేనట. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ వస్తుండటంతో.. ఆయన సమక్షంలో అభ్యర్థి పేర్లపై కొంత స్పష్టత రావొచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి.. అప్పుడైనా ఉపఎన్నిక వ్యూహం కొలిక్కి వస్తుందో లేక నాన్చుడుకే ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.