అధికారపార్టీలో కొత్త పదవులు మాట ప్రకటనకే పరిమితమైందా? 6.మాజీలకు ఇంకా పట్టం కట్టకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ మెలిక పడింది? అందరూ ఆయనవైపే ఎందుకు చూస్తున్నారు? ఏంటా పదవులు? లెట్స్ వాచ్..!
ఈ ఏడాది ఏప్రిల్‌లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. అప్పటి వరకు మంత్రులుగా ఉన్నకొందరు మాజీలు అయ్యారు. తిరిగి ఎమ్మెల్యే పాత్రకే పరిమితం. ఆ సమయంలో మాజీలకు ఊరట కల్పించేలా కొన్ని ప్రకటనలు చేసింది అధికారపార్టీ. అందులో ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఏర్పాటు. కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఆ పోస్ట్‌ను కొడాలి నానికి ఇస్తారని ప్రచారం జరిగింది. కమ్మ సామాజికవర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకపోవడంతో.. అలా సర్దుబాటు చేస్తున్నారని చర్చ సాగింది. ఇప్పటికి నాలుగు నెలలు గడిచిపోయింది. రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఏర్పాటు ముందుకు కదలలేదు. దీనికి మెలిక పడిందని.. ఆయనే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోందట.
సీఎం జగన్ పట్ల వీర విధేయత చూపించే నేతల్లో కొడాలి నాని ఒకరు. అలాంటి నాయకుడిని మంత్రి పదవి నుంచి తప్పించి.. సాధారణ ఎమ్మెల్యేగా పరిమితం చేయడంపై పార్టీ వర్గాల్లోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయట. వాటిని పరిగణనలోకి తీసుకునే ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో పునర్విభజన తర్వాత జిల్లాల సంఖ్య పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి బోర్డే కొలువు దీరితే.. వెనువెంటనే జిల్లా అభివృద్ధి బోర్డులు కొలిక్కి వస్తాయని అనుకున్నారు. మాజీ మంత్రులకు జిల్లా అభివృద్ధి బోర్డు బాధ్యతలు అప్పగిస్తారని.. తద్వారా ప్రొటోకాల్ సమస్య కూడా ఉత్పన్నం కాదని భావించాయి పార్టీ వర్గాలు.
ఈ బోర్డులు, మండళ్ల విధి విధానాలు, స్వరూపం ఏంటో, ఎంత మందితో కూర్పు ఉంటుందో స్పష్టత లేదు. అన్నీ ప్రకటనలు.. చర్చల్లోనే ఉండిపోయాయి. దీనికి మాజీ మంత్రి కొడాలి నాని కారణమని పార్టీలో ప్రచారం జరుగుతోందట. ముందు నుంచీ రాష్ట్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ పదవి పట్ల ఆయనకు ఆసక్తి లేదట. అయితే మంత్రి పదవి.. లేదంటే ఎమ్మెల్యే గిరి అనే ఈక్వేషన్‌తోనే కొడాలి నాని వెళ్తున్నారు. ఆ విషయాన్ని మంత్రి పదవి పోయాక స్వయంగా ఆయనే చెప్పారు. తనను మాజీ మంత్రి అని పిలవొద్దని.. గుడివాడ ఎమ్మెల్యేగానే చూడాలని స్పష్టం చేశారు.
కొడాలి నాని ఎంచుకున్న ఈ వైఖరి కారణంగానే ఏపీ అభివృద్ధి మండలి ఏర్పాటు కొలిక్కి రాలేదని పార్టీ వర్గాల అభిప్రాయంగా ఉందట. దాంతో జిల్లాల్లో బోర్డుల ఏర్పాటుకు ఎసరొచ్చిందని భావిస్తున్నారట. రాష్ట్ర బోర్డే ఏర్పాటు కాకపోతే.. జిల్లా బోర్డులు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్న. ఈ విషయం బయటకు చెప్పుకోకపోయినా.. ఆ పదవి ఆశిస్తోన్న మాజీ మంత్రులు లోలోన ఆవేదన చెందుతున్నారట. ఆ పదవేదో వస్తే కాస్త ప్రొటోకాల్ అయినా దక్కుతుంది.. సమావేశాల్లో మళ్లీ డయాస్ ఎక్కొచ్చు అని నాలుగు నెలల నుంచి లెక్కలేసుకుంటూనే ఉన్నారట. మరి.. ఈ మెలిక ఎప్పుడు వీడుతుందో.. బోర్డు ఏర్పడుతుందో లేదో.. మాజీలకు కొత్త పదవులు వస్తాయో లేదో చూడాలి.