నారా చంద్రబాబు నాయుడు.. నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే. నియోజకవర్గాలు.. పార్టీలు వేరైనా చిత్తూరు జిల్లా వాసులే. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్లల్లో తాతల కాలం నాటి ఇళ్లు ఉన్నాయి. ఇద్దరూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న పరిస్థితి లేదు. కానీ.. వివిద కారణాలతో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఆసక్తిగా మారింది.
ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలోని నారావారిపల్లె. ఆయన మాత్రం మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నియోజకవర్గం కుప్పం. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా.. విపక్ష నేతగా ఉన్నా.. కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు. ఎప్పుడు కుప్పం వచ్చినా ప్రభుత్వ అతిథి గృహంలోనే బస. ఇదే ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారేది. టైమ్ దొరికితే చంద్రబాబు ఇంటి గురించి విమర్శలు చేసేవారు వైసీపీ నేతలు. ఆ విమర్శల వల్లో ఏమో కుప్పంలో తనకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో రోడ్డుపక్కన స్థలాన్ని కొనుగోలు చేశారు. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు టీడీపీ అధినేత.
ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు జిల్లాలోని కలికిరి మండలం నగరిపల్లె. నల్లారి సోదరులంతా నగరిపల్లెలోని పూర్వీకుల ఇంట్లోనే ఉండేవారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే ఇంటికి వచ్చేవారు కిరణ్ కుమార్‌రెడ్డి. 2014 రాష్ట్ర విభజన సమయంలో సొంతపార్టీ పెట్టి ఘోరంగా ఓడాక రాజకీయాలకు దూరమయ్యారు ఈ మాజీ సీఎం. కాంగ్రెస్ పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యే పనిలో పడ్డారు. అయితే కిర్‌ణ్‌కుమార్‌రెడ్డి సొదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీలేరు నుంచి ఆయన టీడీపీ టికెట్‌పైనే పోటీ చేసి ఓడిపోయారు. పీలేరు టీడీపీ ఇంఛార్జ్ కూడా ఆయనే. స్థానిక రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన కిశోర్ కుమార్‌రెడ్డి నగరిపల్లెలోని పూర్వీకుల ఇంటిలోనే ఉంటున్నారు. సోదరుడు ఒక పార్టీ.. తానొక పార్టీలో కొనసాగుతూ ఒకే ఇంటిలో ఉంటే ఇబ్బంది అనుకున్నారో ఏమో.. సొంతూరుకు రావడం తగ్గించేశారు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. పూర్వీకుల ఇంట్లో సోదరుడితో కలిసి ఉండటం కంటే.. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించి కిరణ్ కుమార్‌రెడ్డి సైతం సొంతూరు నగరిపల్లెలో ఇటీవలే సుమారు 7 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారట. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడతారట.
ఇలా ఇద్దరు మాజీ సీఎంలు ఇన్నేళ్లకు సొంత జిల్లాలో సొంత ఇంటి నిర్మాణం ఒకేసారి చేపట్టడం రాజకీయ వర్గాల్లోనూ.. సాధారణ ప్రజానీకంలోనూ చర్చగా మారింది. కాకపోతే వైసీపీ విమర్శల వల్ల చంద్రబాబు.. చంద్రబాబును చూసి కిరణ్ కుమార్‌రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నారని పొలిటికల్ సర్కిళ్లలో సెటైర్లు పేలుతున్నాయి.