ఆ నియోజకవర్గంపై అధికారపార్టీలో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ దఫా గెలిచి తీరాలనే పట్టుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో అక్కడ పాలిటిక్స్‌ను మలుపు తిప్పే గట్టి ప్రయత్నాన్ని ప్రత్యర్థి కూటమి తలపెట్టిందట. ఉమ్మడి అభ్యర్థిని తెరపైకి తెచ్చి “రాజుల” మధ్య పోరుకు సర్వం సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
విశాఖ ఉత్తర నియోజకవర్గ రాజకీయాలు చాలా ప్రత్యేకం. భిన్నమైన పాలిటిక్స్.. సామాజిక ఈక్వేషన్లు కనిపిస్తాయి. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి వలస వచ్చిన జనం నియోజకవర్గంలో ఎక్కువ. 2009లో ఏర్పడిన ఈ స్థానంలో గెలుపోటములతో సంబంధం లేకుండా ఒక్కసారే ఆదరించడం ఇక్కడ సెంటిమెంట్. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తిరిగి ఇక్కడ నుంచి పోటీ చెయ్యబోనని ప్రకటించడంతో అది మరింత బలపడింది.
విశాఖ సిటీ సెంటర్లో ఉండే ఈ సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లో బహుముఖ పోటీ జరిగింది. వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. భారీగా ఓట్లు చీలి వైసీపీ అభ్యర్థి కె.కె.రాజుపై మాజీ మంత్రి గంటా 1900 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో బయటపడ్డారు. ఆ తర్వాత గంటా రాజకీయ స్తబ్దత పాటిస్తున్నారు. ఈ నియోజకవర్గంపై అధికారపార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండుచోట్ల మినహా మిగిలిన 15 డివిజన్లను వైసీపీ కైవశం చేసుకుంది. ప్రస్తుతం నెడ్‌కాప్ చైర్మన్ హోదాలో ఉన్న నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ కె.కె.రాజు మరోసారి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.
విశాఖ నార్త్‌లో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ దిశానిర్దేశం చేసేవాళ్లు లేరు. గంటా ఎమ్మెల్యేగా ఉండటంతో కొత్తవాళ్లకు పార్టీ బాధ్యతలు అప్పగించలేని సంకట స్థితిలో TDP అధిష్ఠానం ఉంది. ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకుంటోంది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే చర్చ అధికార పార్టీలో ఉంది. అయితే గతంలో బీజేపీ నుంచి గెలిచిన విష్ణుకుమార్‌రాజు మరోసారి నార్త్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి కేడర్, లీడర్‌షిప్ లేకపోయినా గత ఎన్నికల్లో విష్ణుకు 19వేల ఓట్లు వచ్చాయి. జీవీఎంసీ ఎన్నికల్లోనూ ఒక డివిజన్‌ను గెల్చుకుంది బీజేపీ.
నార్త్‌లో జనసేన సైతం ఉనికి చాటుకునే పనిలో పడింది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 18 వేల ఓట్లు వచ్చాయి. గతం కంటే ఈసారి ఓట్లు ఇంకా పెరుగుతాయనే అంచనాల్లో జనసైనికులు ఉన్నారు. పైగా ఓట్లను చీలనివ్వకుండా జాగ్రత్త పడతానని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు కూడా. టీడీపీ ఆలోచనలు, జనసేన ప్రకటనలు చూస్తే ఉమ్మడి అభ్యర్థి దిశగా ఏదో వ్యూహం రచిస్తున్నారా? అనే అనుమానాలు ఉన్నాయట. ప్రస్తుతం బీజేపీ, జనసేన మిత్రపక్షాలు. భవిష్యత్‌లో జనసేన, టీడీపీ జట్టు కట్టే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది. ఈ లెక్కలు బేరీజు వేసుకుంటే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఉమ్మడి అభ్యర్థి అవుతారనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. విష్ణు కూడా టీడీపీ, జనసేనలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారట.
గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు నమోదైన ఓట్లకు గల కారణాలను వైసీపీ ఇప్పటికే విశ్లేషించుకుందట. కేంద్రం ప్రవేశ పెట్టిన హౌసింగ్ కారణంగానే బీజేపీ వైపు లబ్ధిదారులు మొగ్గు చూపారని లెక్కలు వేసుకుని.. జగనన్న ఇళ్ల పట్టాల ప్రాధాన్యం పెంచినట్టు టాక్. ఇదే సమయంలో జనసేన సైతం ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో స్పీడ్ పెంచింది. ఈ ఎత్తుగడలు.. నేతల వ్యూహాలు చూస్తుంటే నార్త్‌లో పోటీ రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది.