కాషాయ శిబిరంలో కషాయం డోస్ ఎక్కువైందా? కమలనాథుల్లో కలహాలు పెరిగాయా? నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయట పడుతున్నాయా? పార్టీ సారథి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయా? ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకొనే ఆ జాతీయపార్టీలో అసలేం జరుగుతోంది?
కమలం శిబిరంలో ఏం జరుగుతోంది?
తెలంగాణలో బీజేపీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉందా? నానాటికీ పార్టీ తీసికట్టుగా మారుతోందా? బీజేపీలోని ముఖ్య నాయకులు ఒకరి తీరుపై మరొకరు ఓపెన్‌గా కామెంట్స్ చేయడం.. అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకోవడం ఎక్కువై.. కమలం శిబిరంలో ఏం జరుగుతుందో కేడర్‌కు అంతుచిక్కడం లేదట. పైకి నాయకులంతా కలిసి కట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. వాళ్ల మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఉందన్నది కొందరి వాదన.
బీజేపీ నేతల మధ్య ఆత్మీయత లేదా?
ఇటీవల దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుచోట్ల బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా.. ఆ విక్టరీ ఎఫెక్ట్.. సంతోషం.. సందడి పార్టీ నాయకులు ఎవరి దగ్గరా లేదట. అంతా ఏదో వెలితితో బాధపడుతున్నట్టు సమాచారం. బీజేపీ నేతలంతా ఒక కుటుంబంలా ఉండాలని చెబుతారు. కానీ.. పార్టీ లీడర్స్ మధ్యే ఆత్మీయత లేదని టాక్. ఎవరికి వారు తాము పెద్ద నాయకులుగా ఫీల్ కావడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. కలిసి పనిచేయడం మర్చిపోయారట.
సంజయ్ వ్యాఖ్యల వెనక కథేంటి?
ఇదే సమయంలో కొందరు పార్టీ నాయకులు తరచూ చేస్తున్న కామెంట్స్ విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయట. అంతర్గత పోరు ఇంకా రాజుకోవడానికి ఆ వ్యాఖ్యలు దోహదం చేస్తున్నాయని చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడిన సమయంలో చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారు అన్నది పెద్ద ప్రశ్న.
బీజేపీలో ఇద్దరు మాజీ మంత్రుల తీరుపై చర్చ
బీజేపీలో కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. టికెట్స్ ఇప్పిస్తామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. టికెట్స్ ఇప్పిస్తామన్న వారికి.. వారి వెంట టికెట్స్ కోసం తిరిగే వాళ్లకు పార్టీ ఛాన్సే ఇవ్వబోదని కుండ బద్దలు కొట్టేశారు సంజయ్. ఉత్తరప్రదేశ్‌లో ఇదేవిధంగా చెప్పుకొన్నవాళ్లకు పార్టీ టికెట్ ఇవ్వలేదని.. సీఎం అవుతామని చెప్పుకొన్నవాళ్లు కూడా ఎక్కడా ముఖ్యమంత్రి కాలేదని సంజయ్ తెలిపారు. అయితే ఆయన బీజేపీలో ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారన్నది కమలనాథుల మధ్య చర్చగా మారింది. ఇద్దరు మాజీ మంత్రులను ఉద్దేశించే సంజయ్ ఆ వ్యాఖ్యలు చేశారనేది కొందరి వాదన.
తరచూ అవమానిస్తున్నారని రఘునందన్‌రావు ఫైర్
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రొటోకాల్ పంచాయితీ కూడా కాషాయ శిబిరంలో సెగలు రేపుతోంది. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఆయన ఉన్నారట. తరచూ అవమానిస్తున్నారని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శికి రఘునందన్‌రావు ఫిర్యాదు చేసినట్టు బయటకొచ్చింది. సంజయ్ మొదటిదశ పాదయాత్ర ముగింపు సభ తమ జిల్లాలో జరిగితే వేదికపై కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. రెండో విడత సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశంలోనూ తనను స్టేజ్ మీదకు పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారట రఘునందన్‌రావు. అలాగే అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్.. విప్‌లను ఎందుకు నియమించడం లేదని కూడా ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
సంజయ్ కామెంట్స్.. రఘు ఫిర్యాదులతో పెరిగిన సెగలు
అటు సంజయ్ వ్యాఖ్యలు.. ఇటు రఘునందన్‌రావు ఫిర్యాదులు చూశాక కాషాయ శిబిరంలో సెగలు పెరిగాయి. పాదయాత్ర కారణంగా దాదాపు నెలరోజులపాటు సంజయ్ పార్టీ హెడ్ ఆఫీస్‌కు అందుబాటులో ఉండరు. ఈ సమయంలో ఇంకెలాంటి కలహాలు బయట పడతాయో అని చెవులు కొరుక్కుంటున్నారట కమలనాథులు. ఈ అంశాలు ఢిల్లీ నాయకత్వం వరకు వెళ్తున్నాయో లేదో కానీ.. అక్కడి నుంచి యాక్షన్ లేకపోతే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారట.