ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య.. ఏపీలో సంచలనం సృష్టించింది. హత్య కేసులో ఎమ్మెల్సీ పైనే అనుమానాలు వ్యక్తం చేశారు డ్రైవర్ కుటుంబ సభ్యులు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కుటుంబసభ్యు లు, దళిత సంఘాల ఆందోళనలతో మూడు రోజులకు.. నాటకీయ పరిణామాల మధ్య ఈనెల 23న అనంత బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ విషయంలోనూ పెద్ద సస్పెన్స్ ధ్రిల్లర్ క్రియేట్ చేశారు. వైద్య పరీక్షలు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అంతా ఎమ్మెల్సీకి అనుకూలంగా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్సీ కి మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. వచ్చే నెల 6 వరకు రిమాండ్ లో అయన ఉండనున్నారు. ప్రస్తుతం అనంత బాబు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు వెంటనే కస్టడీ పిటిషన్ వేస్తారు. నిందితు డు మొదట చెప్పిన దానికి.. అదనపు సమాచారం సేకరిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం ఆ ఊసే లేదు. తెలుసుకోవాల్సిన విషయాలన్నీ రాబట్టేశామనో, ఏమో కాని దర్యాప్తులో అంత సీరియస్ నెస్ లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి..
కాకినాడ ఎస్పీ చెప్పిన సమాచారం మేరకు ఉద్దేశపూర్వకంగా అనంత బాబు సుబ్రహ్మణ్యంని చంపలేదు. ఇద్దరి మధ్యా జరిగిన చిన్నపాటి ఘర్షణలో ఈ హత్య జరిగిందని.. గేటు దగ్గర ఉన్న గ్రిల్ తలకి తగిలి సుబ్రహ్మణ్యం చనిపోయాడని ఎమ్మెల్సీ చెప్పారని వెల్లడించారు ఎస్పీ. అయితే హత్యలు రకాల రకాల కారణాలతో జరుగుతుంటాయి. ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో చేసే హత్యలకు శిక్ష తీవ్రంగా ఉంటుంది. ఆత్మ రక్షణ కోసం జరిగే హత్యల ను ఇంకో రకంగా తీసుకుంటారు. డ్రైవర్ హత్య ఇలాగే జరిగింది అని ఎమ్మెల్సీ కథనాన్ని వివరిస్తూ పోలీసులు కన్‌ఫమ్ చేసారు. అయితే ఎమ్మెల్సీని పోలీసులు అదుపులోకి తీసుకున్నాక.. లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచే ముందే పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారని ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన డాకుమెంట్స్ సిద్ధం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. సెక్షన్ 302 అంటే హత్య కేసు.. అటువంటి కేసుల్లో విచారణ చాలా కీలకం. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ జిల్లా పోలీసులు మాత్రం వాటిపై పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు. అన్నీ తమకు తెలుసులే.. కొత్త విషయాలు ఏముంటాయి అనుకుంటున్నారు ఏమో మరి.. ఈ కేసులో ఇప్పటికే అనంత బాబు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం విచారణ అధికారిగా కాకినాడ డిఎస్పి భీమారావు ని నియమించి సరిపెట్టారు. ఇప్పటికే సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పిన దానితో వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆ రోజు ఎటువంటి ఘర్షణ జరగలేదని వాచ్‌మెన్ చెప్తున్నాడు. వచ్చేనెల 6 తర్వాత అనంతబాబును తిరిగి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇప్పడికే 14రోజుల రిమాండ్ గడువు సగం ముగిసింది. ఇక ముందైనా పోలీసులు ఈ కేసుకు సంబంధించి యాక్టివ్‌గా దర్యాప్తు చేస్తుందో, లేదో చూడాలి.