కొత్తపల్లి సుబ్బారాయుడు. రాజకీయంగా దిట్ట అనేది ఒకప్పటి మాట. కొత్త పార్టీల ఎంట్రీతో మారిన రాజకీయాలను అంచనా వేయలేక ఇప్పుడు సాధారణ నాయకుడిగా మిగిలిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వరసగా గెలుస్తూ అదే స్పీడ్‌లో ఉన్నత పదవులు అందుకున్నారు. అప్పటి వరకు జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించేవారు. అలాంటిది 2009 నుంచి ఆయన అంచనాలు సరిగ్గా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అప్పుడు మొదలైన రాజకీయ పతనం.. కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి.. ఉనికి కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు.
టీడీపీని వీడి 2009లో ప్రజారాజ్యంలో చేరారు కొత్తపల్లి. ఆ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో వీలైనమైన తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. అదే చివరి గెలుపు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి మరోసారి బరిలో దిగినా.. వర్కవుట్ కాలేదు. మళ్లీ టీడీపీలోకి వచ్చేశారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు కొత్తపల్లి. 2019 ఎన్నికల సమయంలో మళ్లీ వైసీపీ కండువా కప్పుకొన్నారు ఈ మాజీ మంత్రి. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. అధికారపార్టీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లేదనే ఆవేదనలో ఉండేవారు. ఇంతలో జిల్లాల పునర్విభజనలో నరసాపురానికి అన్యాయం జరిగిందనే గళం ఎత్తుకున్నారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని జరుగుతున్న ఉద్యమంలో ఎమ్మెల్యే ప్రసాదరాజుకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డెక్కి చెప్పుతో కొట్టుకున్నారు కొత్తపల్లి. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించేశారు. ఆ స్టేట్‌మెంట్‌ను.. జరుగుతున్న పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ.. కొత్తపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం కొత్తపల్లి సుబ్బారాయుడు ఏ పార్టీలోనూ లేరు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పడం లేదు. 2009 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో పార్టీ మారడమే పనిగా పెట్టుకున్న ఆయన వెంట కేడర్ కూడా పలచబడింది. చేరబోయే పార్టీపై చాలా ఆలోచనలే చేస్తున్నారట. అందుకే వచ్చే ఎన్నికల్లో కొత్తపల్లి ప్రభావం ఎంతనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తిరిగి టీడీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నా.. అక్కడ అవకాశాలు అంతంత మాత్రమే అని అంటున్నారు. టీడీపీలోనే టికెట్ ఆశిస్తున్న నరసాపురం నేతలకు కొదవ లేదు. ఈ దఫా యువతకు ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో కొత్తపల్లికి టికెట్ ఇస్తారా అనేది డౌటేనట. వైసీపీలో వినిపించినట్టుగా టీడీపీలోనూ గళం విప్పితే సీన్ రివర్స్ కావొచ్చని అనుమానిస్తున్నారట తమ్ముళ్లు. జనసేన వైపు కూడా కొత్తపల్లి చూస్తున్నారనే ప్రచారం ఉంది. పీఆర్పీలో ఉండగా చిరంజీవితో సన్నిహితంగా మెలిగిన కొత్తపల్లి.. ఆయన ద్వారా జనసేన టికెట్ దక్కించుకుంటారని అనుచరులు భావిస్తున్నారట. అయితే టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లితే సుబ్బారాయుడికి ఛాన్స్ దక్కకపోవచ్చనే వాదన ఉంది. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి బొమ్మిని నాయకర్ రెండో స్థానంలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో నాయకర్‌కే పవన్ టికెట్ ఇస్తారని సమాచారం.
నరసాపురం రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తూ.. అందరితోనూ సఖ్యతగా మెలిగే పనిలో పడ్డారట కొత్తపల్లి. అనుచరులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రహస్యంగా ఇతర పార్టీల నేతలతోనూ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నరసాపురం వచ్చి కొత్తపల్లితో సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు జరిపిన చర్చలపై పార్టీల నుంచి సానుకూల స్పందన రాకపోతే కొత్తపల్లి ఏం చేస్తారన్నది ప్రశ్న. ఉన్నది ఒకే ఒక ఆప్షన్ బీజేపీ. అక్కడ కొత్తపల్లికి దక్కే ప్రాధాన్యంపై క్లారిటీ లేదట. మొత్తానికి కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు కొత్తపల్లి పరిస్థితి మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పొలిటికల్ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఆయన ఏ మార్గాన్ని ఎంచుకుంటారో చూడాలి.