సోము వీర్రాజు. ఏపీ బీజేపీ చీఫ్. కోనసీమలో పర్యటనలో భాగంగా అమలాపురం వెళ్దామని అనుకున్నారు. కానీ.. అక్కడ అల్లర్లు జరగడంతో బయట ప్రాంతాల వారిని రానివ్వడం లేదు. సెక్షన్ 30తోపాటు సెక్షన్ 144 అమలులో ఉన్నాయి. దాంతో ఆయన్ని జొన్నాడ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. అయితే బీజేపీకి చెందిన మహిళా నేత తల్లి చనిపోతే పరామర్శకు వెళ్తున్నానన్నది వీర్రాజు చెబుతున్న రీజన్. ఇక్కడే మరో అంశం కూడా ప్రచారంలో ఉంది. అమలాపురానికి చెందిన బీజేపీ నేత బాలయ్య కుమారుడిని అల్లర్ల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడికి వెళ్లి వీర్రాజు హంగామా చేయబోతున్నారని నిఘా వర్గాలకు సమాచారం వెళ్లిందట. అందుకే ఆయన్ని జొన్నాడ దగ్గర అడ్డుకున్నట్టు చెబుతున్నారు. తన కారును కదలనివ్వకపోవడం.. అడ్డంగా కంటైనర్ లారీని అడ్డుపెట్టడంతో వీర్రాజు శివాలెత్తిపోయారు. జరగకూడనిది ఏదో జరిగిపోయినట్టు.. గతంలో ఎప్పుడూ లేని సంఘటన జరిగినట్టుగా భావించి పెద్ద హైడ్రామా క్రియేట్ చేశారు. విధుల్లో ఉన్న SIతోపాటు కానిస్టేబుల్‌ను నెట్టేశారు వీర్రాజు. అదే ఇప్పుడు రచ్చ రచ్చగా మారిపోయింది.
సోము వీర్రాజు తీరుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాధ్యతల గల పదవిలో ఉండి సంయమనం కోల్పోతే ఎలా అనేది కొందరి ప్రశ్న. అయితే వీర్రాజు మరో లెక్క వేసినట్టు తెలుస్తోంది. ఖాకీలను రెచ్చగొడితే అది తమకే ప్లస్ అవుతుందని.. అదుపు చేసే సమయంలో ఎక్కడో ఒకచోట పోలీసులు మిస్టేక్ చేస్తారని భావించారట. కానీ.. మొత్తం ఎపిసోడ్ చిరిగి చేట అయ్యింది. ప్లాన్ మొత్తం రివర్స్ అనే టాక్ నడుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజులపాటు ఏపీలో పర్యటించారు. ఆ టూర్‌లో పార్టీ నేతలతోపాటు.. అధ్యక్షుడి తీరుపైనా పెదవి విరిచారట. తెలంగాణలో బీజేపీ పరిస్థితిని పోల్చుతూ.. ఆ విధంగా ఏపీలో డీల్ చేయలేకపోతున్నారని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారట. చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర నేతలు దూకుడుగా వెళ్లకపోతే.. కేంద్ర నాయకత్వం చేసేది ఏదీ ఉండబోదని తేల్చేశారట పెద్దలు. దాంతో కోనసీమ అల్లర్ల అంశాన్ని వీర్రాజు టేకప్ చేశారని అనుమానిస్తున్నారట. అయితే ఆ తర్వాత కానీ వీర్రాజుకు తత్వం బోధ పడలేదట.
పోలీసులతో తాను అలా వ్యవహరించకుండా ఉండాల్సింది.. అయినా తన పోరాటం ప్రభుత్వంపై తప్ప వ్యక్తుల మీద కాదు అని సముదాయించే ప్రయత్నం చేశారట. దానికి పోలీసులు కూడా తమకు వ్యక్తిగత అజెండాలు ఏమీ ఉండవు కదా సార్ అని చెప్పడంతో.. అది కర్టెక్టే కానీ.. ఆ టైమ్‌లో అలా జరిగిపోయిందని నాలుక కర్చుకున్నారట వీర్రాజు. కానీ.. పోలీసులు ఊరుకోలేదు. విధి నిర్వహణలో ఉన్న SI, కానిస్టేబుళ్లపై దౌర్జన్యం చేసిందుకు వీర్రాజుపై కేసు కట్టేశారు. మొత్తానికి ఆంక్షలు అమలులో ఉన్న కోనసీమలోకి వెళ్లి వచ్చిన తొలి పొలిటీషియన్‌గా బిల్డప్ ఇద్దామని వీర్రాజు అనుకుంటే.. సీన్ రివర్స్ అయిందనే చర్చ నడుతోంది. క్లారిటీ లేకుండా ఖాకీలతో కయ్యానికి కాలుదువ్వి కామైపోయారు.