నోటి దురుసు ఆ ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. కాంట్రవర్శీ కామెంట్స్ ఆయనకు శాపమై.. చిరాకు పెడుతున్నాయి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు.. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపుతో.. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేను రాజీనామా చేయాలంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యే ప్రస్టేషన్.. పీక్ కు వెళ్లినట్లు తెలుస్తోంది . ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ? ఆయన తిప్పలేంటో చూద్దాం…
అచ్చంపేట ఎమ్మెల్యే , విప్ గువ్వల బాలరాజు వ్యవహార శైలి కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సందర్భం ఏదైనా దూకుడుగా వ్యవహరించే గువ్వల బాలరాజుకు.. నోటి దురుసుతనం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. హుజూరాబాద్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఓ చర్చా వేదిక లో గువ్వల బాలరాజు సవాల్ విసిరారు . ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హుజురాబాద్ లో ఈటల గెలిచినప్పటి నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి బిజెపి శ్రేణులు ఫోన్ చేసి, ఎప్పుడు రాజీనామా చేస్తావ్ అంటూ నిలదీస్తున్నారట. రోజు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో.. గువ్వల బాలరాజు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఎందుకు సవాల్ విసిరానా అని అనుకునే పరిస్థితి నెలకొందట. ఇక ఇదే అదనుగా భావించిన విపక్షాలు గువ్వల బాలరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ … మరింత ట్రోల్ చేస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్, బిజెపి నేతలు ప్రెస్ మీట్ పెట్టి గువ్వల ఎప్పుడు రాజీనామా చేస్తారో స్పష్టం చేయాలంటూ నిలదీస్తున్నారట.
రాజీనామా సవాల్ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా గువ్వల బాలరాజు పోలీసులపై నోరు పారేసుకోని అభాసుపాలయ్యారు. ఓ సీఐతో దురుసుగా ప్రవర్తించడం వివాదస్పదంగా మారింది . ముఖ్యమంత్రి కేసిఆర్ పాల్గొన్న మంత్రి శ్రీనివా్‌సగౌడ్ తల్లి దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన గువ్వల బాలరాజు.. ట్రాఫిక్ ఆంక్షలు లెక్కచేయకుండా వెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మీకు కేటాయించిన స్థలంలోనే వాహనాలు ఆపి లోపలికి వెళ్లాలని సూచించడంతో గువ్వల వారిపై మండిపడ్డారు. నన్నే ఆపుతావారా? అంటూ సీఐపై విరుచుకుపడ్డారు. దీటుగా బదులిచ్చిన సీఐ.. ”మీరు ఎమ్మెల్యే అయితే …రా…. అనే అధికారం ఎవరిచ్చారు? రా… అంటే మీ గౌరవం పెరగదు. మర్యాదగా మాట్లాడాలి” అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఎమ్మెల్యేకు మాటా మాటా పెరిగి వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీనియర్ అధికారి ఒకరు కలగజేసుకోని వివాదం సద్దుమణిగేలా చేశారు.
ఈ రెండు ఘటనలు ఇప్పుడు అచ్చంపేట నియోజక వర్గం లోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గువ్వల బాలరాజుది ఫ్రస్టేషనా ? లేక అధికార అహంకారమా ? అని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అచ్చంపేట ప్రజల తీర్పు గువ్వల గ్రాఫ్ పడిపోయిందనడానికి నిదర్శనమని, ఇదే మాదిరిగా వ్యవహరిస్తే పతనం తప్పదంటున్నాయి విపక్ష పార్టీలు.