బలం ఉన్నచోట బరి.. బలం లేనిచోట ప్రత్యర్థిపై గురి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహం ఇదేనా? అన్నిచోట్లా కాకుండా.. కొన్నిచోట్లే పోటీ చేయడం వెనక నాయకుల మతలబు ఏంటి? అప్పనంగా అధికారపార్టీకి కట్టబెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏంటా పార్టీ? వారు వేస్తున్న లెక్కలేంటి?
నల్లగొండలో నేతల మధ్య కుదరని సయోధ్య..!
తెలంగాణ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఖమ్మంలో రాయల్ నాగేశ్వరరావు, మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డికి బీఫామ్ ఇచ్చి అధికారికంగా బరిలో నిలిపింది. నిజామాబాద్‌లో పోటీ చేయాలని చూసి.. ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గింది. పోటీ ఇవ్వగలిగే బలం ఉన్నా.. నల్గొండలో చేతులు ఎత్తేసింది. స్థానిక నాయకుల మధ్య సయోధ్య సాధ్యంకాక హ్యాండ్స్ అప్ అన్నట్టు టాక్. ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిల మధ్య సయోధ్య కుదరలేదట.
స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలే ప్రచార అజెండా..!
నల్లగొండ బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్.. కాంగ్రెస్ మద్దతు కోరారు. చివరి వరకు పోటీలో ఉండేవారికే మద్దతు ఇవ్వాలన్నది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉన్నా.. లేకున్నా బరిలో ఉండాలి అనుకున్న నాయకులను రంగంలోకి దింపింది పార్టీ. స్థానిక సంస్థల్ని ప్రభుత్వం నీరుగార్చిందన్నది కాంగ్రెస్ ఆరోపణ. పనులు చేయించి.. నిధులు విడుదల చేయడం లేదని మండిపడుతున్నారు ఆ పార్టీ నాయకులు. అప్పులు తెచ్చి పనులు చేస్తున్నవాళ్లలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు.. నిధులు విడుదలకాక లబోదిబో మంటున్నారని మండిపడుతున్నారు.
అధికారపార్టీలోని అసంతృప్తులకు గాలం..!
స్థానిక ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ఎమ్మెల్సీఎన్నికల్లో చర్చకు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే మెదక్‌లో ఎమ్మెల్యే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భార్య నిర్మలను బరిలో దించారు. భవిష్యత్ రాజకీయానికి బాటలు వేస్తున్నారనే టాక్ కూడా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుటుంబం నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారట. రాజకీయంగా జిల్లాలో చక్రం తిప్పే ఆలోచనలో జగ్గారెడ్డి ఉన్నట్టు టాక్. ఇక ఖమ్మంలో అధికారపార్టీలోని అసంతృప్తులకు గాలం వేసే ప్లాన్‌లో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.
బహుముఖ అంశాలే ప్రచార అస్త్రాలు..!
టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం కాకూడదని.. సొంత పార్టీ నేతలను తిరిగి గాడిలో పెట్టాలని.. స్థానిక సంస్థలకు అన్యాయం జరుగుతోందని.. తదితర అంశాలను ప్రచారాస్త్రాలు చేయబోతోంది కాంగ్రెస్. ఈ అంశాలు ప్రభుత్వానికి సెగ తగిలిస్తాయని భావిస్తోంది. అందుకే ఖమ్మం, మెదక్‌లతోపాటు స్వతంత్రులు బరిలో ఉన్నచోట వారికి మద్దతివ్వడానికి సిద్ధమైంది కాంగ్రెస్. మరి.. ఈ వ్యూహం పార్టీకి ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.