వచ్చే నెల 2,3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్‌లో జరగబోతున్నాయి. ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకురావాలని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాల రూపకల్పన చేశారు కమలనాథులు.
3న ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధానితోపాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతారు కూడా. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో సభను సక్సెస్ చేయాలన్నది బీజేపీ ఆలోచన. ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శల సమావేశాలో సభపై చర్చ జరిగింది. దాదాపు 10 లక్షల మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతం నుంచి ఎంత మందిని సభకు తీసుకురావాలి.. ఎవరు బాధ్యతలు తీసుకోవాలో ఆ సమావేశంలో సూత్రప్రాయంగా చెప్పారట. ప్రధాని మోడీ సభ కావడంతో జన సమీకరణపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు పార్టీ రాష్ట్ర నేతలు. టార్గెట్లు ఫిక్స్ చేయడంతో.. అంతా ఆ పనిపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాలని సూచించారట. జనసమీకరణకు కావాల్సిన వాహనాలను ముందుగానే మాట్లాడుకోవాలని చెప్పేశారట.
ప్రస్తుతం బీజేపీ నేతలకు బీపీ తెప్పిస్తున్న మాట పదిలక్షలు. అంతమందిని ఎలా సమీకరించాలో అని మల్లగుల్లాలు పడుతున్నారట. పది లక్షల మందిని తరలించడం అంత ఈజీ కాదని.. అందుకు వాహనాలను సమకూర్చుకోవడం సవాలేనని అనుకుంటున్నారట. పైగా ఇది వర్షాకాలం. సభా సమయంలో వర్షం పడితే ఇబ్బందులు తప్పవు. ఇటు చూస్తే రాష్ట్రంలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. రైతులు, వ్యవసాయ దారులు.. కూలీలు సాగు పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకోవైపు యువతను తరలిద్దామన్నా.. వాళ్లంతా ఉద్యోగాల కోసం గట్టిగానే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఇంకా సంస్థాగతంగా బలంగా లేదు. అలాంటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకురావాలని అనుకుంటే అయ్యే పని కాదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ సభకు ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్.. పార్టీ నేత ప్రదీప్ కుమార్‌లు ఆ కమిటీలో ఉన్నారు. వాళ్లంతా జన సమీకరణపై గట్టిగానే కసరత్తు చేస్తున్నత్తు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే ఎక్కువ మందిని తరలిస్తే కొంతలో కొంతైనా అంచనాలకు దగ్గరకు రాగలమని పార్టీ నేతలు భావిస్తున్నారట. అందుకే గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల బీజేపీ నేతలు శక్తి కేంద్రాల ఇంఛార్జులపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రధాని మోడీ సభకు భారీగా జన సమీకరణ బీజేపీ నేతలకు పెద్ద పరీక్షే పెడుతోంది.