గెలిచే అవకాశం లేకపోయినా.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ ఎందుకు దిగుతోంది? అన్ని చోట్లా పోటీ చేస్తుందా.. కేవలం కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందా? ఈ విషయంలో కమలనాథుల లెక్కలేంటి?
బలం లేని చోట బరిలో బీజేపీ..!
తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి నెలకొన్నా.. వార్ ఏకపక్షం కావడంతో పెద్దగా చర్చ లేదు. ఎన్నికలు జరిగే 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం టీఆర్ఎస్‌వే. ఈ ఎన్నికల్లో ఓటేసే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సంఖ్యా బలం కూడా అధికార పార్టీకే ఎక్కువగా ఉంది. పన్నెండుకు పన్నెండు గులాబీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్నిచోట్ల పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. బలం లేనప్పుడు కమలం పార్టీ ఎందుకు బరిలో దిగుతోంది? కమలనాథుల వ్యూహం ఏంటి? అన్నదే ఇప్పుడు చర్చ.
రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్‌లలో పోటీ..?
తమ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు ఉన్నచోట పోటీ చేయాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. వారి దృష్టిలో రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ ఉన్నట్టు సమాచారం. రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పోటీ చేయడం ద్వారా అధికారపార్టీని అదిరించొచ్చని లెక్కలేస్తున్నారట. తమకు ఉన్న ఓట్లతోపాటు.. అధికారపార్టీకి చెందిన ఓట్లు క్రాస్ అవుతాయని అంచనా వేస్తున్నారట బీజేపీ నేతలు.
బీజేపీ ఓట్లు చెదిరిపోకుండా సరికొత్త ఎత్తుగడ..!
గతంలో కూడా బీజేపీకి సంఖ్యాబలం లేకపోయినా.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు కూడా బరిలో దిగడం వల్ల తమ ఓట్లు తమకే పడతాయని.. చెదిరిపోవని భావిస్తున్నారట. నిధుల విడుదల, విధుల కల్పనలో ప్రభుత్వంపై MPTCలు గుర్రుగా ఉన్నారని బీజేపీ వాదన. అలాంటి వారంతా MLC ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తారని అనుకుంటున్నారట. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో బీజేపీకి.. గ్రేటర్ కార్పొరేటర్లను కలుపుకొంటే 150కిపైగా ఓట్లు ఉన్నాయట. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ బీజేపీకి కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఎక్కడా కూడా ఎమ్మెల్సీ సీటును కైవశం చేసుకునేంత బలం లేదు.
బీజేపీ బరిలో ఉంటే.. వారి పంట పండినట్టేనా?
ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. బీజేపీ నుంచి గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధుల్లో చాలా మంది టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆ విధంగా చూస్తే కమలం బలం తగ్గినట్టే. అయినప్పటికీ.. ఉన్నవాళ్లను కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో బరిలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయేమోనని బాధపడ్డ ప్రజాప్రతినిధులకు బీజేపీ నిర్ణయం హుషారు తీసుకొచ్చిందట. టీఆర్‌ఎస్‌తోపాటు మిగతా పార్టీలు బరిలో ఉంటేనే..తమ పంట పండుతుందని అనుకుంటున్నారట. వారి ఆశలు ఎలా ఉన్నా.. బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.