తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్ మొదలైంది. అదేరోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ సభలకు రెడీ అవుతున్నాయి. విమోచన దినం పేరుతో కమలనాథులు.. ఆత్మగౌరవ సభ పేరుతో గజ్వేల్‌లో కాంగ్రెస్ ఫోకస్‌పెట్టాయి. మరి.. టీఆర్‌ఎస్ ఆలోచన ఏంటి? అధికారపార్టీ ఏం చేయబోతోంది?
తెలంగాణలో సెప్టెంబర్ 17 వేడి!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వస్తుంది అంటే తెలంగాణలో పొలిటికల్‌గా హాట్ హాట్ చర్చ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 17 పై రాజకీయ పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిజాం పరిపాలనలో ఉన్న భూభాగం భారత్‌లో కలిసిన రోజు కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది. కొందరు విలీనం అంటే.. మరికొందరు విమోచనం.. ఇంకొందరు విద్రోహదినం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దీనిపై పెద్ద చర్చ జరిగేది. తెలంగాణ ఏర్పడి నప్పటి నుంచి ఆ వేడి ఇంకా రాజుకుంది.
నిర్మల్‌లో అమిత్ షాతో బీజేపీ భారీ కార్యక్రమం!
సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నది బీజేపీ డిమాండ్. సంగ్రామ యాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సెప్టెంబర్ 17న నిర్మల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆహ్వానించారు కమలనాథులు. దీంతో నిర్మల్ సభకు ఒక్కసారిగా రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
సెప్టెంబర్ 17నే గజ్వేల్‌లో కాంగ్రెస్ భారీ సభ!
ఇక ఇదే రోజున గజ్వేల్‌లో ఆత్మగౌరవ సభ నిర్వహించే పనిలో ఉంది తెలంగాణ కాంగ్రెస్. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గజ్వేల్ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు రేవంత్ అండ్ బ్యాచ్. సెప్టెంబర్ 17న విలీన దినంగా పరిగణిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. బీజేపీ ఇదే రోజున నిర్మల్‌లో సభ పెడుతుండటంతో.. పోటీగా గజ్వేల్ సభను కాంగ్రెస్ ఎంచుకుందన్నది రాజకీయ వర్గాల అనుమానం. అయితే విలీనం.. విమోచనం అని కాకుండా గజ్వేల్ కార్యక్రమానికి దళిత గిరిజన ఆత్మగౌరవ సభ అని పేరు ప్రకటించింది. ఇదే పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో పలు సభలు నిర్వహించింది కాంగ్రెస్. అందుకే ఒకేరోజు జరిగే రెండు పార్టీలు కార్యక్రమాలపై చర్చ మొదలైంది.
టీఆర్ఎస్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
సెప్టెంబర్ 17 విషయంలో అధికారపార్టీ టీఆర్‌ఎస్ ఆలోచన వేరు. పార్టీల మధ్యే భిన్నమైన వాదనలు ఉన్నాయని గులాబీ నేతలు గతంలో అనేకసార్లు స్పష్టం చేశారు. ఆ రోజున టీఆర్ఎస్ కార్యాలయాల్లో జెండా జెండాను ఆవిష్కరించి అంతటితో సరిపెడుతోంది. ఈ ఏడాది బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాలు ఎలా ఉన్నా.. తమ వైఖరి మాత్రం మారబోదన్నది టీఆర్‌ఎస్ వర్గాల మాట. విపక్షపార్టీలు ఎంత హడావిడి చేసినా గులాబీ శిబిరం తొణకడం లేదు. టీఆర్ఎస్‌కు ఒక విధానం ఉందని దానినే ఫాలో అవుతామన్నది వారి వాదన. బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రం… రాష్ట్రంలో బలమైన పార్టీలుగా అవతరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇప్పుడు సెప్టెంబర్ 17ను కూడా ఆ కోణంలోనే చూస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి.. 17 తర్వాత ఆ ప్రభావం ఎవరికి కలిసి వస్తుందో చూడాలి.