ఒక్కరి కోసం కొత్త సంప్రదాయానికి తెరతీశారా? పదవీకాలంలో ఉండగానే మరొకరితో రాజీనామా చేయించారా? లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన ఆ ఒకే ఒక్కరి వెనక ఎవరు ఉన్నారు? ఆ పవర్ఫుల్ రికమండేషన్ ఎవరిది?
ఢిల్లీ ఎల్ఏసీ ఛైర్మన్‌ను చేయడం కోసమే ప్రశాంతిరెడ్డితో రాజీనామా చేయించారా?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పట్లో ఒత్తిళ్లు తప్పేలా లేవు. బోర్డు నియామకం జరిగిపోయినా.. తమ అనుచరులకు పాలకమండలిలో సభ్యత్వం ఇప్పించేందుకు ఢిల్లీస్థాయిలో సిఫారసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిఫారసు చేసిన పెద్దలను సంతృప్తిపరుస్తూ జంబో బోర్డును ఏర్పాటు చేసినా.. వారు శాటిస్ఫై కాలేదట. 18 మంది ఉండాల్సిన బోర్డును 25కు పెంచారు. 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. మొత్తం మూడు జీవోలు విడుదల కాగా.. వాటిలో రెండు జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. మరో జీవో కింద బోర్డు సభ్యులైన 24 మందిలో 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. బోర్డు సభ్యుల నియామకాల్లో రాజకీయ సిఫారసులు చెల్లుబాటు కాబోవని.. మరికొందరు సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేశారు బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి. ఇంతలో టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాజీనామా చేశారు. కోర్టులో పిటిషన్ వేయడం వల్ల.. నొచ్చుకుని పదవికి రాజీనామా చేశారని అంతా అనుకున్నారు. కానీ.. ప్రశాంతిరెడ్డిని ఢిల్లీ LAC ఛైర్మన్‌ను చేయడం కోసమే రాజీనామా చేయాలని కోరారని ప్రచారం జరిగింది.
కేంద్రంలో కీలకంగా ఉన్న బీజేపీ పెద్దాయన నుంచి మరో సిఫారసు..!
గత పాలకమండలిలో దాదాపుగా 8 మంది LAC ఛైర్మన్లు పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఇక ఉత్తరాది ఆలయాల అభివృద్ధి కోసం ప్రశాంతిరెడ్డిని ఆ పోస్టులో నియమించామని టీటీడీ ఇచ్చిన వివరణ కూడా చర్చగా మారింది. ప్రస్తుత టీటీడీ పాలకమండలిలో ఏపీ కంటే ఇతర రాష్ట్రాల సభ్యులే ఎక్కువ. ఏపీలో ఎమ్మెల్యే కోటా నుంచి ముగ్గురిని మినహాయిస్తే ప్రశాంతిరెడ్డితో కలిపి నలుగురికే అవకాశం దక్కింది. మిగిలిన సభ్యులకు పక్క రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రుల సిఫారసులు ఉన్నాయి. అంతా కొలిక్కి వచ్చిన తర్వాత కేంద్రంలో కీలకంగా ఉన్న బీజేపీలోని ఒక పెద్దాయన నుంచి ఒక సిఫారసు వచ్చిందట. గత రెండు పాలకమండలిలో సభ్యుడిగా ఉన్న కృష్ణమూర్తిని టీటీడీ బోర్డు సభ్యుడిని చేయాలని ఆ సిఫారసు సారాంశం. అప్పటికే బోర్డు నియామకం పూర్తయింది. కొత్తగా ఇంకొకరిని తీసుకోవాలంటే చట్ట సవరణ చేయాలి. ఈ దశలో అలా చేస్తే ఏమవుతుందో ఏమో అని అనుకున్న ప్రభుత్వ పెద్దలు.. ఉన్న బోర్డు సభ్యులలో ఒకరితో రాజీనామా చేయించాలని అనుకున్నారట.
ప్రశాంతిరెడ్డి ఎగ్జిట్.. కృష్ణమూర్తి ఎంట్రీ..!
లేట్‌గా సిఫారసు చేసిన ఆ పెద్దాయన ఎవరు?
ఏపీ నుంచి సభ్యులైన నలుగురిలో పోకల అశోక్ కుమార్, మల్లీశ్వరి, మారుతి మొదటిసారి బోర్డులోకి వచ్చారు. ప్రశాంతిరెడ్డికి రెండోసారి అవకాశం దక్కింది. దాంతో ఆమే త్యాగం చేయాల్సి వచ్చిందని టాక్. ఆ విధంగా TTD బోర్డు నుంచి ప్రశాంతిరెడ్డి ఎగ్జిట్.. కృష్ణమూర్తి ఎంట్రీకి వీలుకల్పించిందని చర్చ జరుగుతోంది. ప్రశాంతిరెడ్డి రాజీనామా చేసిందే తడవుగా కృష్ణమూర్తిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు వచ్చాయి. అలా ఉత్తర్వులు రాగానే కృష్ణమూర్తి మూడోసారి బోర్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయింది. ప్రశాంతిరెడ్డి పదవి చేపట్టి నెలరోజులకే రాజీనామా చేయగా.. కృష్ణమూర్తి మాత్రం నెలరోజులు ఆలస్యమైనా పాలకమండలిలో చేరిపోయారు. అయితే కృష్ణమూర్తి పేరును రికమండ్ చేసిన కేంద్రంలోని ఆ బీజేపీ పెద్దాయన ఎవరు? లేట్‌గా సిఫారసు చేసినా.. పరిగణనలోకి తీసుకున్నారంటే ఆయన చాలా పవర్ఫుల్ అని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఈ ఒత్తిళ్లు ఇక్కడితో ఆగుతాయో.. ఇంకా కొనసాగుతాయో చూడాలి.