Vizianagaram YCP Politics:
విజయనగరం జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. నేతల మధ్య పోరు కన్నా.. అది సామాజికవర్గాల రణంగా మారడంతో మరింత వేడెక్కుతోంది. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేరు చెబితే విజయనగరం బీసీ నేతలు రుస రుసలాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కోలగట్లకు కాకుండా బీసీలకు వైసీపీ టికెట్ కేటాయించాలని స్వరం పెంచుతున్నారు అధికారపార్టీలోని ఆ వర్గం నాయకులు. మూడు నెలలుగా ఇదే పెద్ద చర్చగా ఉంది. ఏ కార్యక్రమం చేపట్టినా బీసీ నేతలంతా ఒకే నినాదం అందుకుంటున్నారు. వీరి వెనక పార్టీ నేతలు పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్‌లు ఉండటంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది. వీరిద్దరూ మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరులు కావడంతో.. సమస్య అందరి అటెన్షన్ తీసుకొస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారనే గట్టి ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే కోలగట్ల. తనకు కాకపోతే తన కుమార్తె శ్రావణిని అయినా బరిలో దించాలని చూస్తున్నారు. పార్టీ టికెట్ చేజారే అవకాశం ఉండబోదని.. తన స్థాయిలో పావులు కదుపుతున్నారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా.. తనదే టికెట్ అని ఇటీవల మంత్రి బొత్స సమక్షంలోనే చెప్పేశారు కోలగట్ల. వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ చుట్టూనే విజయనగరం రాజకీయంపై చర్చ నడుస్తోంది. వ్యతిరేకవర్గానికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడం కూడా పార్టీవాళ్లను ఆలోచనలో పడేసిందట.
విజయనగరంలో బీసీ నినాదం వెనక మంత్రి బొత్స ఉన్నట్టు ఎమ్మెల్యే కోలగట్ల అనుమానిస్తున్నారట. అందుకే బొత్స సమక్షంలోనే తన వ్యతిరేకులకు సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారని భావిస్తున్నారు. వాస్తవానికి విజయనగరంలో బొత్స, కోలగట్ల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. అది మున్సిపల్ ఎన్నికల సమయంలో బయట పడింది కూడా. ఇద్దరూ ఎదురుపడితే నవ్వుతూ పలకరించుకుంటారు. ఎవరికీ కనిపించకుండా నొసటితో వెక్కిరించుకుంటారని పార్టీ వర్గాల టాక్. ఆ మధ్య వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని కలెక్టరేట్ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం చెంత నిరసన తెలిపారు పార్టీ నేతలు. కాదూ కూడదని అంటే.. కోలగట్లను ఓడిస్తామని చెప్పేశారు. అప్పటి నుంచి విజయనగరంలో కోలగట్ట వర్గానికి, బీసీ నాయకులకు అస్సలు పడటం లేదు.
పైకి చెప్పకపోయినా.. లోపల మాత్రం ఎవరు చేయాల్సిన రాజకీయం వాళ్లు చేస్తున్నారట నాయకులు. అయితే రాజకీయ ఆధిపత్యానికి సామాజిక రంగుం పూయడమే పార్టీ నేతల మధ్య దూరం పెంచేస్తోంది. ఇన్నాళ్లూ విజయనగరంలో వైసీపీ బలంగా ఉందని భావించిన వాళ్లకు ఈ వర్గపోరు అంతుచిక్కడం లేదట. మరి.. ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితిని చల్లార్చేందుకు పార్టీ పెద్దలు ఎప్పుడు చొరవ తీసుకుంటారో చూడాలి.