చంద్రబాబుకు పార్టీ నేతలు చుక్కలు చూపిస్తున్నారా? ఏ విషయంలో అధిష్ఠానాన్ని కంగారెత్తిస్తున్నారు? పార్టీలో గందరగోళానికి దారితీస్తున్న అంశాలేంటి? సమస్యను సెట్ చేసేందుకు హైకమాండ్ తంటాలు పడుతోందా? అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు జాప్యం చేస్తారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. పైకి చెప్పకపోయినా.. తెలుగు తమ్ముళ్లు అంతర్గత భేటీలలో.. ప్రైవేట్ సంభాషణల్లో తెగ చికాకు పడుతుంటారు. దీనికి విరుగుడు కనిపెట్టాలని అనుకున్నారో ఏమో.. వాళ్లు పెట్టిన రివర్స్ ఫిట్టింగ్ అధిష్ఠానానికి పెద్ద షాకే ఇచ్చిందట. నియోజకవర్గాల ఇంఛార్జులే తమకు టికెట్లు ఖరారైనట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేసుకుంటున్నారట. ఆ మధ్య చంద్రబాబు నిర్వహించిన సమీక్షలకు వెళ్లిన ఇంఛార్జుల్లో మెజారిటీ నేతలు ఈ తరహా ప్రచారం చేసుకోవడం అధినేతకు తలనొప్పిగా మారిందట.
నాలుగు రోజులపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 17 అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్షలు చేశారు చంద్రబాబు. నియోజకవర్గాలోని పరిస్థితులతోపాటు.. ఇంఛార్జుల పనితీరుపై సమగ్రంగా చర్చించారట. ఇంఛార్జులకు సంబంధించి తన వద్ద ఉన్న రిపోర్టులను బయటకు తీసి పరిస్థితిని వివరించారట. అక్కడ పార్టీ పరిస్థితి… కుల సమీకరణాలు లెక్కలు బయటకు తీశారట. చురుకుగా లేని కొందరు ఇంఛార్జులకు చిన్నసైజు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. అవనిగడ్డ, పెనమలూరు, ఆళ్లగడ్డ, మార్కాపురం, గుడివాడ, గుంటూరు-ఈస్ట్, ఒంగోలు, రాజంపేట, పుంగనూరు సెగ్మెంట్లల్లో ఫోకస్ పెంచాలని చంద్రబాబు సూచించారట. ప్రతి 3 నెలలకోసారి ఇంఛార్జులతో సమీక్షలు ఉంటాయని.. ఈలోగా పనితీరు మెరుగు పర్చుకోకపోతే టికెట్ ఉండబోదని చంద్రబాబు స్పష్టం చేశారట.
సమీక్షల్లో జరిగింది ఒకటైతే.. సమావేశాల తర్వాత నియోజకవర్గాలకు వెళ్లిన ఇంఛార్జులు చేసుకున్న ప్రచారం మరొకటి. సమావేశాలకు పిలిచి తమకు టికెట్లు ఖరారు చేశారని ఊదరగొట్టేశారట. దీంతో లోకల్ టీడీపీ నాయకులు, శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారట. నియోజకవర్గాల్లో పార్టీ నేతలను వాకబు చేయకుండా ఎలా టికెట్లు ఖరారు చేస్తారని జిల్లా, ప్రాంతీయ టీడీపీ సమన్వయ కర్తలపై కస్సుమన్నారట తెలుగు తమ్ముళ్లు. అదేం లేదని పార్టీ నేతలు వారించినా.. పట్టించుకోవడం లేదట లోకల్ కేడర్. అసలేంటీ గొడవ.. టికెట్ల విషయం ఎందుకొచ్చింది అని పార్టీ నేతలు ఆరా తీస్తే.. వాళ్లకు అసలు విషయం తెలిసిందట.సమీక్షలకు వచ్చిన ఇంఛార్జుల్లో కొందరు ఈ విధంగా ప్రచారం చేసుకోవడంతో లేనిపోని గందరగోళానికి దారితీసిందని గ్రహించారట. ఈ విషయం తెలిసి టీడీపీ అధిష్ఠానం కంగుతిందట.
చంద్రబాబు టికెట్స్ ప్రకటించడం ఎలాగూ ఆలస్యం అవుతుందని.. ఇంఛార్జులు ఇలా ముందుగానే తమ పేర్లను చర్చకు పెట్టేశారని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. హైకమాండ్‌పై ఒత్తిడి పెరిగి టికెట్స్ ఖరారు చేస్తారనే లెక్కలు వేసుకుని ఉంటారని అభిప్రాయ పడుతున్నారు. దీనిపై పార్టీ వర్గాల్లో సెటైర్లూ పేలుతున్నాయి. చంద్రబాబు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నట్టు టాక్. మరి.. ఆయనే మంత్రం వేస్తారో చూడాలి.