మాచర్ల విధ్వంసాన్ని పోలీసులు ముందే పసిగట్ట లేదా? బాస్‌ల మధ్య కోఆర్డినేషన్ లోపం.. రావణకాష్టానికి దారితీసిందా? మాచర్ల గొడవలపై డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న పోస్టుమార్టం ఏంటి? బాధ్యులపై చర్యలు ఉంటాయా?
చాలాకాలం తర్వాత మాచర్లలో మంటలు
పోలీసుల పనితీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది మాచర్ల విధ్వంసం. ఒక్కసారిగా రెండు వర్గాలు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగడం.. అది ఉధృతరూపం దాల్చడం.. వాహనాలకు నిప్పు పెట్టడం.. సంచలనంగా మారాయి. అంత జరుగుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వలేదా? లేక పైస్థాయిలో వచ్చిన గ్యాప్‌తో సమస్య చెయ్యి దాటిపోయిందా?. లోపం ఎక్కడున్నప్పటికీ చాలాకాలం తర్వాత మాచర్లలో మంటలు రేగాయి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ చేపడుతున్నట్టు సమాచారం లేకే.. గొడవలను నియంత్రించ లేకపోయామని DIG సహా పోలీసు పెద్దలు చెబుతున్నారు. అయితే టీడీపీ ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడే రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో గొడవలు జరిగే ఆస్కారం ఉందో నిఘా వర్గాలు హెచ్చరించాయట. వాటిల్లో కొన్ని చిన్నా చితకా ఘటనలు జరిగేవి ఉంటే.. ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న చోట పరిస్థితి తీవ్రంగానే ఉంటుందని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో మాచర్ల ఉందట. అయితే పోలీస్ బాస్, ఇంటెలిజెన్స్ వర్గాల మధ్య కొద్దిరోజుల క్రితం మెమో వార్ నడిచింది. ఆ ప్రభావం మాచర్లలో కనిపించిందనేది కొందరి అభిప్రాయం.
జిల్లా ఎస్పీ మాచర్లకు వచ్చాకే వాస్తవాలు తెలిశాయా?
పోలీసులు తేరుకునే లోపుగానే మాచర్లలో పరిస్థితి అదుపుతప్పింది. ఘర్షణలను మొదలైనా.. ఇక్కడ పెద్దగా గొడవలేమీ లేవని .. అన్నీ సర్దుబాటు అయిపోతాయని.. మీడియాలో చూపించినట్టు ఏమీ లేదని.. ఉన్నతాధికారులకు స్థానిక పోలీసులు చెప్పారనే చర్చ నడుస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి మాచర్లకు అదనపు సిబ్బందిని పంపే ప్లాన్ టైమ్‌కు వర్కవుట్ కాలేదని అభిప్రాయ పడ్డారట. జిల్లా ఎస్పీ మాచర్లకు వచ్చేంత వరకు కచ్చితమైన సమాచారం ఉన్నతాధికారులకు చేరలేదనేది ఖాకీ వర్గాల వాదన. స్థానికంగా ఉన్న ఒత్తిళ్లో.. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారనే భయమో ఏమో మరోసారి పొలిటికల్ పార్టీలకు పోలీసులు కార్నర్ అయ్యారు. దీంతో స్థానిక పోలీసుల తీరుపై పోలీస్ బాసులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మాచర్ల గొడవలపై పైస్థాయిలో సమీక్ష చేసినట్టు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో బాధ్యులను తేల్చేలా పోస్టుమార్టం
మాచర్ల గొడవలపై నమోదైన కేసుల్లో నిందితులను పట్టుకున్న తర్వాత.. క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లపై పోలీసు ఉన్నతాధికారులు మరోసారి విస్తృతంగా సమీక్ష చేస్తారని అనుకుంటున్నారు. బాధ్యులను తేల్చే పనిలో పడ్డారట. పల్నాడులోని మాచర్లలో హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఆ దిశగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారట. వాస్తవానికి మాచర్లలో ఆ రోజు జరిగిన ఘటనలో స్థానికంగా ఉన్న ఓ పోలీస్ అధికారి చొరవ తీసుకుని.. టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డిని నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లడానికి ఒప్పించిపోకపోయి ఉంటే మరింత దారుణం జరిగేదనే వాదన కూడా ఉంది. అందుకే పోలీసుల పోస్టుమార్టంలో ఏం తేలుస్తారో..? అనే ఉత్కంఠ సిబ్బందిలో నెలకొందట.
.