Andhra Pradesh Politics : ఏపీలో టీడీపీ-బీజేపీ బంధం చిగురిస్తోందా..? ఇప్పటి వరకు ఊహాజనితంగా ఉన్న ఈ చర్చ.. నిజరూపం దాల్చబోతోందా..? ఏపీలో పొత్తుకు….తెలంగాణలో తన బలాన్ని బీజేపీకి చంద్రబాబు ఎరగా వేశారా..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సజ్జల కామెంట్లతో ఇప్పుడీ చర్చ మరింత ఎక్కువగా జరుగుతోంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో ప్రధాని మోడీ.. టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. వీరిద్దరూ కలిసి పట్టుమని ఐదు నిమిషాలు కూడా మాట్లాడుకోలేదు. పైగా వీరి మధ్య రాజకీయపరమైన చర్చ జరిగిందని ఎక్కడా పెద్దగా ఫోకస్ కూడా కాలేదు. కానీ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చేసిన కామెంట్లతో, ఏపీలో 2014లో పొత్తుల సీన్ రిపీట్ కానుందా..? అనే చర్చ జరుగుతోంది. టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు జట్టు కట్టబోతున్నాయా..? అని ఊరువాడా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టు పొత్తులు ఉండడానికి బేస్ ఏంటీ అనే విషయాన్ని కూడా సజ్జలే చెప్పేశారు. తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తామని చెప్పడం ద్వారా, ఏపీలో పొత్తుకు రెడ్ కార్పెట్ వేసుకుంటున్నారని సజ్జల కామెంట్ చేశారు.
ఇప్పుడు సజ్జల కామెంట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజంగానే ఈ తరహా చర్చ ఉందా..? తెలంగాణలో టీడీపీతో జట్టు కట్టాలని బీజేపీ భావిస్తోందా..? అనే అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణాలో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి వెళ్తే బాగుంటుందనే భావన కొందరు తెలంగాణ బీజేపీ నేతల్లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణలో ఉన్నంత బలంగా, దక్షిణ తెలంగాణలో అంత పవర్ ఫుల్ గా బీజేపీ లేదన్న చర్చ వుంది. ప్రత్యేకించి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆ పార్టీ బలం అంతంత మాత్రమే. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బలం పుంజుకోవాలంటే టీడీపీ మద్దతు ఉంటే బాగుంటుందనే భావన కొందరిలో ఉందట.
తెలంగాణలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీకి పెద్దగా హోల్డ్ లేకున్నా.. ఆ పార్టీ సానుభూతి పరులు కొన్ని కొన్ని పాకెట్స్‌లో ఉన్నారని అంటున్నారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా టీడీపీ సానుభూతిపరులు.. కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఉండే ప్రాంతాలు కాస్తో కూస్తో ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే..అలాగే జనసేనను కూడా కలుపుకుని వెళ్తే పెద్ద సంఖ్యలో స్థానాలు దక్కించుకోవచ్చనేది కొందరు బీజేపీ నేతల అంచనా అట. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు చంద్రబాబు దీన్నో అవకాశంగా మలుచుకుంటున్నారనేది తాజా చర్చ. తెలంగాణలో తాము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని.. అదే తరహాలో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్దామని బాబు లెక్కలు వేస్తున్నట్టు కొంత కాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది వర్కవుట్ అవుతుందని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తే.. టీడీపీ-బీజేపీల మధ్య అవగాహనకు తెలంగాణ ఎన్నికలే బీజం వేస్తాయనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఏపీలో కూడా అదే కాంబినేషన్‌లో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
అయితే ఇదంతా టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం మాత్రమే అనే వాదనా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతల్లో చాలామంది టీడీపీతో పొత్తు లేకుండా ఉండాలనే భావిస్తున్నారని అంటున్నారు. గడచిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు చిత్తు చిత్తుగా ఓడిపోయిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పేరు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రస్తావనకు వస్తే చాలు.. మళ్లీ తెలంగాణ-సీమాంధ్ర పంచాయతీ తెర మీదకు వస్తుందని.. అది అల్టిమేట్‌గా కేసీఆర్‌కు.. టీఆర్‌ఎస్ పార్టీలకే లాభం చేకూరే అంశమని అంటున్నారు. గతానుభవాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో ఎంత దూరంగా ఉంటే.. అంత మంచిదని కొందరు తెలంగాణ బీజేపీ నేతల వాదన.
అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా.. అన్ని లెక్కలు.. అన్ని రకాల అంచనాలను వేసుకున్న తర్వాతనే బీజేపీ అధినాయకత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. తీస్‌మార్ ఖాన్‌లనుకున్న చాలా మంది నేతలను ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్న మోడీ-షాలకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదా అంటున్నారు. తెలంగాణ విషయంలో పార్టీకి ఏది మంచో, ఆలోచించి.. ఆ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు ఉంటుందా..? ఉండదా..? అనేది తెలంగాణ ఎన్నికలతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం చెబుతున్నారు.