శంకర నారాయణ. మాజీ మంత్రి. పెనుకొండ ఎమ్మెల్యే. కేబినెట్లో చోటు కోల్పోయిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లాకు వైసీపీ అధ్యక్షుడయ్యారు. ఆయనకు పార్టీ బాధ్యతలు కొత్త కాదు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సుదీర్ఘకాలంపాటు ఆయనే వైసీపీ చీఫ్. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షుడు. ఆ సమయంలో పార్టీలో ఎక్కడా.. ఎవరి మధ్యా విభేదాలు కనిపించలేదు. మాజీ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టాక అసలు సిసలైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు శంకర నారాయణ. వాటిపైనే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రెండుచోట్ల అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఇందులో శంకర నారాయణ సొంత నియోజకవర్గం పెనుకొండ కూడా ఉంది. 2019లో మంత్రి అయినప్పటి నుంచీ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో ఆయనకు రెబల్స్ తయారయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడే శంకర నారాయణపై ఓపెన్‌గా కామెంట్స్ చేసి అలజడి రేపారు. మొన్నటికి మొన్న వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే.. ఆయన ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు అసంతృప్తి నేతలు. ఇప్పుడు శంకర నారాయణకు మంత్రి పదవి పోవడంతో రెబల్స్ గ్రూప్‌లో సంతోషం కనిపించినా.. మళ్లీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంపై అసంతృప్తి ఉందట.
టీడీపీ నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా హిందూపురంలో వైసీపీ విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అక్కడ వైసీపీ నేత నవీన్ నిశ్చల్‌ను కాదని.. అధిష్ఠానం 2019లో మాజీ ఐపీఎస్ మహ్మద్ ఇక్బాల్‌కు టికెట్ ఇచ్చింది. నవీన్, ఇక్బాల్‌ల మధ్య అప్పుడు మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. హిందూపురంలో పార్టీ కార్యక్రమాలు రెండు గ్రూపులు వేర్వేరుగా చేస్తున్నాయి. ఇద్దరు నేతలను కూర్చోబెట్టి సయోధ్యకు ప్రయత్నించలేదు పార్టీ పెద్దలు. ఇంతలో ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో సమస్య మరింత సున్నితంగా మారినట్టు చెబుతున్నారు. నవీన్ వర్గంపై ఇక్బాల్ ఆధిపత్యం ఎక్కువైందనే ప్రచారం ఉంది. ఈ రెండు గ్రూపులను మాజీ మంత్రి శంకర నారాయణ ఎంత వరకు కలుపుకొని వెళ్తారన్నది ప్రశ్న.
గతంలో జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసినా.. మంత్రిగా ఉన్నా పెద్దగా వివాదాల జోలికి వెళ్లలేదు శంకర నారాయణ. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముందున్నది ఆయనకు ముసళ్ల పండగే. అన్నీ సవాళ్లే. ఇంటిపోరు చక్కదిద్దుకోవాలి.. పక్క నియోజకవర్గాల్లోని సమస్యలను పరిష్కరించాలి. ఇంతకుముందులా కామ్‌గా ఉంటానంటే పార్టీ పెద్దలు చూస్తూ ఊరుకోరు. మరి.. మాజీ మంత్రి శంకర నారాయణ రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహం ఎంచుకుంటారో చూడాలి.