ఇది ఒక్క ఏడాది సంభవించిన కరువు కథ కాదు. ఒక్క నగరంలో నీళ్లు ఇంకిపోయిన వార్త కూడా కాదు. భూమి మీద నీరు దివాలా తీస్తోందని ఐక్యరాజ్యసమితి అధికారికంగా హెచ్చరిస్తున్న క్షణం ఇది. నీరు దివాలా తియ్యడమేంటని ఆలోచిస్తున్నారా? ఈ పదం వినియోగించడానికి ఒక బలమైన కారణముంది.
ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ నివేదిక ఒక కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అదే ‘వాటర్ బ్యాంక్రప్సీ..’! అంటే నీరు దివాలా తియ్యడమని అర్థం. నదులు, భూగర్భ జలాలు, సరస్సులు ఇక మళ్లీ కోలుకునే అవకాశం కూడా లేకుండాపోయిన దశను ఈ పదం గుర్తుచేస్తోంది. ఇటు చెన్నై, బెంగళూరు, ఎన్సీఆర్ లాంటి నగరాలు ఇప్పటికే ‘డే జీరో’ పరిస్థితిని చూశాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి. ట్యాంకర్ల మీద ఆధారపడే జీవితం. ఇప్పటికే మొదలైన పతనానికి ఇవే సంకేతాలు.
ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతున్నది కూడా ఇదే. నీటి సమస్య ఇక భవిష్యత్తు ముప్పు కాదు. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం. ఇది రైతుల సమస్యో, నగరాల సమస్యో కాదు.. ప్రతీ ఒక్కరి సమస్య. ఇంతకీ ఈ వాటర్ బ్యాంక్రప్సీ అంటే ఏంటి? భారత్ ఈ స్థితికి ఎలా చేరింది?
ఇండియా ఈ స్థితికి ఎలా చేరిందన్న ప్రశ్నకు చాలా సమాధానలున్నాయి. ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ విడుదల చేసిన గ్లోబల్ వాటర్ బ్యాంక్రప్సీ రిపోర్ట్ 2026 ఒక స్పష్టమైన నిజాన్ని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఉపయోగిస్తున్న నీటి పరిమాణం, ప్రకృతి మళ్లీ తయారు చేసే నీటికన్నా చాలా ఎక్కువగా మారిపోయింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో ఈ తేడా మరింత ప్రమాదకరంగా పెరుగుతోంది. భారత్ దీనికి మినహాయింపేమీ కాదు. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉపయోగిస్తున్న ఫ్రెష్ వాటర్‌లో 70 శాతం పైగా వ్యవసాయ రంగానికే వెళ్తోంది. ఇది భారత పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. దేశంలో నదుల నీరు, కాలువలు మాత్రమే కాదు.. భూగర్భ జలాల మీదే వ్యవసాయం ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ అదే భూగర్భ జలాలు ఇప్పుడు వేగంగా ఖాళీ అవుతున్నాయి. భూగర్భ జలాల్లో మాయమయ్యే నీరు.. మళ్లీ త్వరగా నిండదు. వర్షం కురిసినా కూడా ఆ గ్యాప్ పూడ్చలేని పరిస్థితి రావొచ్చు.
ఇప్పటికే నగరాలు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాయి. చెన్నైలో కొన్ని సంవత్సరాల క్రితం తాగునీటి నిల్వలు పూర్తిగా ఎండిపోయాయి. బెంగళూరులో వేలాది బోర్‌వెల్స్ పని చేయకుండా పోయాయి. NCR ప్రాంతంలో కొత్త కాలనీలు ట్యాంకర్ నీటిపైనే బతుకుతున్నాయి. నివేదిక ఈ పరిస్థితిని డే జీరోగా నిర్వచిస్తోంది. అంటే మౌలిక వసతులు ఉన్నా.. నీరు లేని అత్యవసర దశ అని అర్థం. ఇక ఈ నీటి దివాలా ప్రభావం కేవలం తాగునీటితోనే ఆగదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం నీటి కొరత ఆహార భద్రతను దెబ్బతీస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడే కోట్లాది కుటుంబాల ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగాలు తగ్గుతాయి. ఆహార ధరలు పెరుగుతాయి. గ్రామాల నుంచి నగరాల వైపు వలసలు పెరుగుతాయి. ఇది ఒక చైన్ రియాక్షన్.
ఇంకో భయానక అంశం కూడా ఉంది. గత ఐదు దశాబ్దాల్లో ప్రపంచం సుమారు 41 కోట్ల హెక్టార్ల వెట్‌ల్యాండ్స్‌ను కోల్పోయింది. ఇది యూరోపియన్ యూనియన్ పరిమాణంతో సమానం. వెట్‌ల్యాండ్స్ అంటే నీటిని నిల్వ చేసే సహజ బ్యాంకులు. అంటే వర్షపు నీటిని, నదుల నుంచి వచ్చే నీటిని కొంతకాలం నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు మెల్లగా విడుదల చేసే సహజ ప్రాంతాలు. అవి నశిస్తే, వరదలు ఎక్కువ అవుతాయి. కరువులు తీవ్రమవుతాయి. అదే సమయంలో వాతావరణ మార్పు వల్ల గ్లేషియర్లు కరుగుతున్నాయి. 1970 తర్వాత ప్రపంచ గ్లేషియర్ మాస్లో 30 శాతం పైగా నష్టం జరిగింది. ఇది భారత్ లాంటి దేశాలకు మరో పెద్ద ముప్పు. ఎందుకంటే హిమాలయాల నుంచి వచ్చే నీటిపై కోట్ల మంది ఆధారపడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ట్యాంకర్లు, లోతైన బోర్‌వెల్స్‌తో పాటు నదుల నీటిని మరో చోటికి మళ్లించడం లాంటి తాత్కాలిక పరిష్కారాలు ఇక సరిపోవని నివేదిక హెచ్చరిస్తోంది. భారత్ లాంటి దేశాలు నిర్మాణాత్మక మార్పులు చేయాల్సిందేనని స్పష్టం చేస్తోంది. భూగర్భ జలాలపై నియంత్రణ, ఎక్కువ నీరు తాగే పంటల నుంచి మార్పు, నీటి సామర్థ్యానికి అనుగుణంగా పట్టణ ప్రణాళికలు చేయడం లాంటివి ఇకపై తప్పనిసరి అంటోంది. ఇక ఐక్యరాజ్యసమితి హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే, భారత్ తరచూ ఎదుర్కొంటున్న నీటి సంక్షోభాల నుంచి శాశ్వత నీటి దివాలా స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్తు కథ కాదు. మన కళ్ల ముందే జరుగుతున్న వాస్తవం.
నీరు లేకుండా పరీక్షలు రాసే విద్యార్థులు, పంటలు లేకుండా జీవించే రైతులు, ట్యాంకర్ల కోసం ఎదురుచూసే నగరాలు..ఇవే వాటర్ బ్యాంక్రప్సీకి తొలి సంకేతాలు.
ALSO READ: 40 లక్షల మంది హ*త్య.. సంచలనం రేపుతోన్న నివేదిక.. ఈ పాపం ఎవరిది?