Tamil Audience : తమిళ తంబీలు ఇక మారరా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే తమిళ హీరోల సినిమాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి వసూళ్లు సాధిస్తున్నాయో చూస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలను ఎంతో ఆదరిస్తుంటారు. కానీ మన హీరోల సినిమాలను తమిళంలో ఎంత వరకు ఆదరిస్తున్నారు. ఇది ఎప్పుడూ వినిపించే ప్రశ్న. తమిళ యావరేజ్ హీరోల సినిమాలు కూడా ఇక్కడ మంచి కలెక్షన్లు సాధిస్తుంటే.. మన స్టార్ హీరోల సినిమాలు తమిళంలో మామూలు వసూళ్లు కూడా సాధించట్లేదు. సినిమా బాగా లేదని కాదు. అక్కడి వారు మన సినిమాలను ఆదరించట్లేదు. అదే తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఉన్న తేడా. చాలా సార్లు తమిళ హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే.. మన హీరోల సినిమాలు వాయిదా పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
Read Also : Samantha : వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. సమంత పోస్ట్
అలాంటి సందర్భాలు తమిళంలో మన సినిమాలకు ఉన్నాయా అంటే అసలే లేవు. మన హీరోల సినిమాల సంగతి దాకా ఎందుకు.. మన తెలుగు డైరెక్టర్లతో తమిళ హీరోలు తీసే సినిమాలకు కూడా తమిళ్ లో కలెక్షన్లు రావట్లేదంటే వాళ్లు ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ధనుష్ నటించిన సార్, కుబేర సినిమాలను చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది. సార్ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా చేసిన ఈ మూవీ మంచి హిట్ అయింది. కానీ దానికి తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. సాధారణంగా హీరో ఏ భాష వ్యక్తి అయితే అక్కడ సినిమాకు ఆదరణ ఉంటుంది. అక్కడే కలెక్షన్లు, బిజినెస్ అన్నీ ఉంటాయి. ధనుష్ కు తమిళంలో బిగ్ మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉన్నాయి.
కానీ తమిళ్ లో సార్ సినిమాకు వచ్చిన కలెక్షన్ల కంటే తెలుగులోనే ఎక్కువ వచ్చాయంటే ధనుష్ ఫ్యాన్స్ అక్కడ ఆదరించలేదనేగా. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర విషయంలోనూ ఇదే జరుగుతోంది. కుబేరలో ధనుష్ ది మెయిన్ లీడ్ రోల్. బిచ్చగాడిగా ఆయన పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ధనుష్ ను కేంద్రంగా చేసుకునే మూవీ కథ తిరుగుతుంది. అలాంటప్పుడు తమిళంలోనే ఈ మూవీ బిజినెస్ ఎక్కువగా జరగాలి కదా. కానీ తెలుగులోనే జరిగింది. తెలుగులో రూ.33 కోట్ల బిజినెస్ జరిగితే.. తమిళంలో 20 కోట్లు చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తెలుగులోనే ఎక్కువ జరిగాయి. తమిళంలో మూవీ వేవ్ అస్సలు కనిపించట్లేదు.
వాళ్ల హీరో మెయిన్ లీడ్ అయినా సరే.. మన తెలుగు డైరెక్టర్, ఒక తెలుగు హీరో ఉన్నందుకు సినిమానే పట్టించుకోకపోవడం ఏంటి. అంటే డైరెక్టర్ ఉన్నంత మాత్రాన సినిమానే పట్టించుకోరా. అలాంటప్పుడు మన తెలుగు హీరోల సినిమాలను అసలు చూస్తారా. ఇప్పుడున్న పాన్ ఇండియా రోజుల్లో సినిమాలు అన్ని భాషల్లో ఆడుతున్నాయి. కానీ తమిళ తంబీలు మాత్రం వాళ్ల లోకల్ సినిమాలను తప్ప బయటి సినిమాలను పెద్దగా ఆదరించట్లేదు. చివరకు డైరెక్టర్ వేరే భాష వాడైనా తమకు వద్దంటున్నారు. ఇన్నేళ్లు అయినా ఇక వాళ్లు మారరా అని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. తమిళ తంబీలు ఈ విషయంపై ఆలోచించుకోవాలి.
Read Also : Mega-Anil Movie : మెగా-అనిల్ సినిమా.. జాయిన్ కాబోతున్న వెంకీ..