ఈ మధ్యకాలంలో సినిమా జర్నలిస్టులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు అటు సెలబ్రిటీలకే కాదు, కామన్ ఆడియన్స్‌కి కూడా చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో “అతని ఫేస్ హీరో మెటీరియల్ కాదు, అయినా రెండు హిట్లు కొట్టారు కాబట్టి అది హార్డ్ వర్క్ అనుకోవాలా లేక లక్ అనుకోవాలా?” అనే ఒక మహత్తరమైన ప్రశ్న ఎదురైంది. ఒక రకంగా ఇది ఆయనను కించపరిచేలాంటి ప్రశ్న. సదరు జర్నలిస్ట్ ఉద్దేశం ఏమైనా అయి ఉండవచ్చు కానీ, దాన్ని సక్రమంగా మెచ్చుకోదగిన ప్రశ్నగా తీసుకొచ్చినప్పుడే జర్నలిజం విలువలు ఏమిటో తెలుస్తాయి.
ఆ విషయం మీద వెంటనే శరత్ కుమార్ మైక్ అందుకొని ప్రశ్నకు తగ్గట్టుగానే సమాధానం చెప్పారు. ఇప్పుడు అదే జర్నలిస్ట్ మరోసారి తాను అడుగుతున్న పదానికి అర్థం ఏమిటో కూడా తెలియకుండా సిద్దు జొన్నలగడ్డను “మీరు రియల్ లైఫ్‌లో ఉమనైజరా?” అంటూ ప్రశ్న సంధించారు. దానికి జర్నలిస్ట్ లింక్ చేసిన విధానం ఆసక్తికరం. సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి రిలేషన్‌లో ఉన్నట్లుగా చూపించారు. దాన్ని బేస్ చేసుకుని సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్‌ని ఆమె ఉమనైజర్ అని ఫీలయ్యారు. వాస్తవానికి ఉమనైజర్ అనే పదానికి అర్థం ఏమిటంటే, ఎక్కువ మంది మహిళలతో తక్కువ సమయం రిలేషన్స్ పెట్టుకొని వారిని వదిలేసే వ్యక్తి అని.
సినిమాలో చూపించిన ట్రైలర్ ప్రకారం, హీరోయిన్స్ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలుసు. మొత్తం ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఇక్కడ ‘ఉమనైజర్’ అనే పదం ఎందుకొచ్చిందో తెలియదు కానీ, జర్నలిస్ట్ సిద్దు జొన్నలగడ్డను “మీరు రియల్ లైఫ్‌లో ఉమనైజరా?” అని అడిగితే, పాపం ఆయనకి ఏం చెప్పాలో తెలియక “ఇది పర్సనల్ ఇంటర్వ్యూనా లేక ప్రెస్ మీటా?” అంటూ ఆ ప్రశ్నను అక్కడితో ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము అడుగుతున్న ప్రశ్నలకు లేదా ఆ ప్రశ్నల్లో వాడుతున్న పదాలకు అర్థం కూడా తెలియని విధంగా ప్రశ్నలు సంధిస్తూ ఉండడంతో, కామన్ ఆడియన్స్ కూడా “ఇలాంటి వారిని ఇంకా ఎందుకు ప్రెస్ మీట్లకు రానిస్తున్నారు?” అంటూ ఆయా వీడియోల కింద కామెంట్స్ చేస్తున్నారు.