సినిమా వాళ్లంటే లక్షలలో రెమ్యూనరేషన్లు, ఏసీ కార్లు – కేరవాన్లలో జీవితం. వాళ్లకేం, పెద్దగా కష్టపడకుండానే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అనే ఫీలింగ్ సాధారణ ప్రేక్షకులలో చాలా కామన్. అయితే సినీ పరిశ్రమను దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే సినీ కష్టాలు తెలుసు. సినీ కష్టాలంటే సినిమాల్లో అవకాశాల కోసం పడిన కష్టాలు కాదు ఒక సినిమా మొదలుపెట్టాక ఫైనల్ కాపీ చేతికి వచ్చేవరకు ఉండే ఇబ్బందులు. నిజానికి అవన్నీ ఒక ఎత్తు. అవన్నీ చూసుకునేది నిర్మాతయే. కానీ ఒక సినిమా షూటింగ్లో ఎంతో కష్టపడితేనే ప్రేక్షకుల ముందుకు ఒక ఔట్పుట్ వస్తుంది అనే విషయాన్ని నేడు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసింది మజాకా టీం. సందీప్ కిషన్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రావు రమేష్, మన్మధుడు ప్రేమ్ అన్షు ఇతర కీలక పాత్రలలో మజాకా అనే సినిమా తెరకెక్కుతోంది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజేష్ దండతో పాటు అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమా సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించే ప్రయత్నం చేశారు మేకర్స్. అయితే ఆ ప్రయత్నం బానే ఉంది కానీ ఆ లొకేషన్ ఎంపిక హాట్ టాపిక్ అయింది. వికారాబాద్ శివారు పరిగి ప్రాంతంలో ఉన్న ఒక వ్యూ పాయింట్ దగ్గరలో ఈ సినిమాలోని రాములమ్మ అనే సాంగ్ షూట్ ప్లాన్ చేశారు. అక్కడికి మీడియాను ప్రత్యేకమైన ఏసీ బస్సుల్లో తీసుకువెళ్లారు.
Chiranjeevi – Ravipudi: భీమ్స్ అన్ డ్యూటీ
సాంగ్ షూట్ అంతా ఒక కొండ మీద జరుగుతోంది. కింద బేస్ క్యాంప్ వరకు వెహికల్స్ లో వెళ్లిన ఆ తర్వాత అక్కడ నుంచి పైకి ఒక అరకిలో మీటర్ మేర లైట్ బాయ్ సహా హీరో, హీరోయిన్ వరకు అందరూ నడిచి వెళ్లాల్సిందే. అక్కడికి మీడియా ప్రతినిధులను కూడా ఆ నడకదారిలోనే తీసుకు వెళ్ళారు. కామన్ ఆడియన్స్ కంటే సినీ పరిశ్రమకు కాస్త దగ్గరగా మెలిగే మీడియాకు సినీ కష్టాలు కొంతవరకు అవగాహన ఉంటాయి కానీ అసలు అవుట్డోర్ షూట్ అంటే ఇలా ఉంటుంది అని ఒక అవగాహన తీసుకొచ్చేందుకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించారేమో అనిపించింది. ఎందుకంటే వేసవి రాకపోయినా ఎండలు దంచి కొడుతున్నాయి. ఒకపక్క పై నుంచి సూర్యుడి భగభగలు మరోపక్క ఆ వేడికి కింద నుంచి వచ్చే సెగలు వెరసి అక్కడ కనీసం నుంచోలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ ఎండ వేడిలో హీరో హీరోయిన్లు వెన్నెలలా ఫీల్ అయి డ్యూయెట్ చేయాల్సిన రావడం నిజంగా కష్టం సాధ్యమే. అలా ఒకరకంగా సినిమా వాళ్ళ షూటింగ్ కష్టాలు చూపించేందుకు మీడియాని తీసుకు వెళ్లిన ఫీలింగ్ కలిగింది. ఈ మధ్యకాలంలో సినిమాలను ఖండిస్తున్న తీరు, నచ్చకపోతే రివ్యూలలో రేటింగ్స్ లో ఏకిపారేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. బహుశా అందుకే మజాకా టీం సినిమా కష్టాలను చూపించేందుకు మిట్ట మధ్యాహ్నం నడి ఎండలో కొండలు, గుట్టలు ఎక్కించి ఒక టీజర్ చూపించినట్లు అనిపించింది. మొత్తం మీద మజాకా టీం చేసిన ప్రయత్నం మాత్రం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.