తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. నిజానికి కరోనా ముందు వరకు ఓటీటీ సంస్థల ప్రాబల్యం అంతగా తెలుగు సినీ పరిశ్రమ మీద ఉండేది కాదు. ఎప్పుడైతే కరోనా కారణంగా జనం అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు అప్పుడు ఓటీటీకి విపరీతమైన కంటెంట్ అవసరం ఏర్పడింది. దీంతో ఓటీటీ సంస్థలు సినిమా రిలీజ్ కూడా కాకముందే కాంబినేషన్స్ చూసి అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టాయి. అంతేకాదు, కరోనా టైంలో ఆయా సంస్థలకు విపరీతమైన రాబడి రావడంతో ఆ వచ్చిన డబ్బుని మళ్లీ సినిమాల మీదే ఇన్వెస్ట్ చేసేందుకు సినిమాకి ఎంత అయినా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా కోట్లకు కోట్లు కాంబినేషన్ల మీద నమ్మకాలతో పెట్టుబడులు పెట్టారు.
Also Read:Prem Kumar : యూటర్న్ తీసుకుంటోన్న సాఫ్ట్ దర్శకుడు
తర్వాత కాలంలో ఆ భారీగా పెట్టుబడి పెట్టిన సినిమాలన్నీ చాలావరకు బోల్తా పడ్డాయి. దీంతో ఓటీటీ సంస్థలు ఇప్పుడు పెట్టుబడి పెట్టడం కాదు కదా, నిర్మాతలతో గీచి గీచి బేరాలాడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు నిర్మాతలు కూడా ఓటీటీ సంస్థల నుంచి వచ్చే ఆదాయాల మీద పెద్దగా ఫోకస్ చేసే వాళ్ళు కాదు. ముందుగా థియేట్రికల్ నుంచి ఎంత రాబట్టుకోవాలా అని ప్రయత్నం చేసేవారు. తర్వాత శాటిలైట్, ఆడియో లాంటి ఆప్షన్స్ చూసుకునేవాళ్లు. ఇప్పుడు థియేటర్ల రాబడితో సమానంగా ఓటీటీ రాబడి ఉంటుంది. ఒకప్పుడు సినిమాలు మొదలుపెట్టినప్పుడు కాంబినేషన్లు చూసి అడ్వాన్స్ ఇచ్చిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు ఆయా సినిమాల రిలీజ్ డేట్లను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసింది.
Also Read:Nara Lokesh meets Amit Shah: అమిత్ షాతో నారా లోకేష్ భేటీ
ఏకంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, నాగార్జున కుబేర లాంటి సినిమాల రిలీజ్ డేట్లను కూడా ఓటీటీ సంస్థలు కంట్రోల్ చేస్తున్నాయి అంటే, ఇప్పుడు నిర్మాతల జుట్టు సంస్థల చేతిలోకి ఎంత వరకు వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఈ విషయంలో మేల్కొని ఓటీటీ సంస్థలతో సంబంధం లేకుండా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది నిర్మాతలు మాత్రం ఓటీటీ సంస్థలు కూడా పెట్టుబడి పెడుతున్నాయి కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తే తప్పేంటి అని వారితో అంటకాగడానికే సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఓటీటీ సంస్థల ప్రాబల్యం మాత్రం తెలుగు సినీ పరిశ్రమ మీద విపరీతంగా కనిపిస్తుంది. ఇది పెరిగితే థియేటర్ల వ్యవస్థకు కచ్చితంగా ఏ రోజైనా ఇబ్బందే అని చెప్పక తప్పదు. హిందీలో ఇప్పుడు ఎలా అయితే ఎనిమిది వారాల థియేటర్ రన్ విండో ఉందో, తెలుగులో కూడా అలాంటిది ఫాలో అవ్వకపోతే భవిష్యత్తులో సినీ థియేటర్ల వ్యవస్థకు ముప్పు తప్పదు. ఈ విషయంలో సినీ పెద్దలతో పాటు థియేటర్ యాజమాన్యాలు కూడా మేల్కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.