రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4-5 తేదీల్లో అబుదాబిలో రష్యా-ఉక్రెయిన్-అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశాలు జరుగుతాయన్నారు. ఉక్రెయిన్ అర్థవంతమైన సంభాషణకు సిద్ధంగా ఉందని చెప్పారు. గౌరవప్రదమైన ముగింపునకు ఆసక్తి కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు టెలీగ్రామ్ పోస్టులో జెలెన్‌స్కీ తెలిపారు.
అయితే జెలెన్‌స్కీ ప్రకటనపై ఇంకా రష్యా, అమెరికా అధికారికంగా స్పందించలేదు. అయితే శనివారం రష్యా అగ్ర సంధానకర్త కిరిల్ డిమిత్రివ్.. ఫ్లోరిడాలో అమెరికా ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. ప్రస్తుతం డాన్‌బాస్ అతి పెద్ద వివాదంగా మారింది. దీనిపైనే పంచాయితీ తెగడం లేదు. ఇదే సున్నితమైన అంశంగా మారింది. ఈ ప్రాంతం నుంచి రష్యన్ దళాలను పూర్తి ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. అయితే రష్యా మాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో పంచాయితీ ఎటు తెగడం లేదు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పురోగతి లభించలేదు. తొలుత సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. అయినా కూడా ఫలితాన్నివ్వలేదు. అనంతరం ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో సమావేశం అయ్యారు. అనంతరం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీ, ఈయూ దేశాధినేతలతో ట్రంప్ సమావేశమై చర్చలు జరిపారు. అయినా పంచాయతీ తెగలేదు. తాజాగా 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఈ ప్రణాళిక రష్యాకు నచ్చింది గానీ.. జెలెన్‌స్కీకి నచ్చలేదు. ట్రంప్ దూతలు ఇరు పక్షాలతో చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. గత వారం అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో చర్చలు జరిగాయి. మరోసారి చర్చలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఏమవుతుందో చూడాలి.
