వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జకియా ఖానం రాజీనామాను ఆమోదిస్తే.. డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా పోతుంది.
జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. జకియా ఖానంను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. రెండేళ్ల నుంచి ఆమె వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో మంత్రి నారా లోకేష్‌ను జకియా ఖానం కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో లోకేష్‌ను సత్కరించారు కూడా. దీంతో అప్పుడే జకియా ఖానం టీడీపీలోకి వస్తారని చర్చ జరిగింది.
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీతో పాటుగా పదవులకు కూడా రాజీనామా చేశారు. జకియా ఖానంతో కలిపి ఇప్పటివరకు వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఈ జాబితాలో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ఉన్నారు.